ఆరేళ్ల తర్వాత మాస్ డైరెక్టర్ తెలుగు సినిమా..?
ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, వీవీ వినాయక్ ఇటీవల ఒక యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేశారు.
By: Tupaki Desk | 13 Feb 2024 4:29 AM GMTటాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవర్ ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అసలైన మాస్ మజాని రుచి చూపించిన దర్శకుడాయన. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన వినాయక్.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన తన న్యూ ప్రాజెక్ట్ ను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, వీవీ వినాయక్ ఇటీవల ఒక యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన దర్శకుడు.. ఈసారి యంగ్ స్టర్స్ తో వెళ్ళాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా తన ప్రాజెక్ట్ లోకి యువ హీరో విరాట్ కర్ణ ని మెయిన్ లీడ్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.
'పెద కాపు 1' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు విరాట్ కర్ణ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. విరాట్ మాత్రం డెబ్యూ మూవీతోనే అందరి దృష్టిలో పడ్డాడు. దీనికి సీక్వెల్ గా 'పెద కాపు 2' చేయనున్నట్లు ప్రకటించారు కానీ, అది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వినాయక్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేయటానికి రెడీ అవుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
'ఆది' సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన వివి వినాయిక్.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ కథలతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు. ఠాగూర్, దిల్, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ, బన్నీ, కృష్ణ, అదుర్స్, నాయక్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా రాణించారు. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'అఖిల్' సినిమా డిజాస్టర్ గా మారడంతో ఆయన కెరీర్ పై పెద్ద దెబ్బ పడినట్లయింది.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెం.150' ఘన విజయం సాధించినప్పటికీ, వివి వినాయక్ కెరీర్ ఊపందుకోలేదు. 2018లో 'ఇంటెలిజెంట్' మూవీ ఘోర పరాజయం చవిచూడటంతో మళ్లీ ఇప్పటి వరకూ తెలుగులో మరో సినిమా చేయలేకపోయారు. మధ్యలో 'శీనయ్య' అంటూ నటుడుగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు కానీ, వర్కౌట్ కాలేదు.
ఇక 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. తెలుగులో అంత పెద్ద హిట్టయిన ఈ చిత్రం.. హిందీలో ఒక్కరోజు కంటే ఎక్కువ ఆడలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన మాస్ డైరెక్టర్.. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఆయన ఈసారి ఎలాంటి కంటెంట్ తో వస్తారో చూడాలి.