అఘోరి కోసం దేశం విడిచిన రష్యన్ యువతి?!
By: Tupaki Desk | 3 Feb 2025 7:08 AM GMTప్రేమకు సాధువులు, అఘోరీలు సైతం అతీతులు కాదు అనడానికి పురాణాల్లోనే ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు లైవ్ గా అలాంటి ప్రేమకథ చూడండి అంటూ యూట్యూబ్ మీడియా ఊదరగొడుతోంది. భారతదేశానికి చెందిన ఒక అఘోరీతో రష్యన్ యువతి లవ్ స్టోరి వింటుంటే ఆశ్చర్యపోని వారు లేరు. వివరాల్లోకి వెళితే..
నిజానికి అఘోరిల ప్రపంచం మర్మమైనది. తీవ్రమైన, కఠినమైన ఆచారాలతో నిండి ఉంది. వారు ప్రాపంచిక అనుబంధాలను త్యజించి అతీతమైన జీవన విధానంతో కఠినమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందుతారు.వారి కఠినమైన క్రమశిక్షణ దృష్ట్యా అఘోరి- రష్యన్ యువతి ప్రేమకథ ఆసక్తిని కలిగిస్తోంది. ఇది నిజమా కాదా? అనేది బిగ్ డిబేట్ గా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక 'మహా కుంభమేళా-2025' ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. వేలాదిగా సాధువులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రయాగ్ రాజ్ వేదికగా సాధువులు, అఘోరీల గురించి చాలా కథనాలు యూట్యూబ్ లో మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో నెటిజనుల దృష్టిని ఆకర్షించిన ఒక ప్రత్యేక కథ అఘోరి - రష్యన్ మహిళ ప్రేమకథ. వైరల్ గా షేర్ అవుతున్న ఈ వీడియో చూసాక సాధారణ ప్రజలు అవాక్కవుతున్నారు. సదరు రష్యన్ మహిళ అఘోరితో ఎంతగా ప్రేమలో పడిందంటే ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి భారతదేశంలో స్థిరపడిందట. అఘోరీ ఆమె లేనిదే జీవించలేని స్థితికి చేరుకున్నాడు అంటూ ప్రచారమవుతోంది. అయితే ప్రాపంచిక సుఖాల కోసం ఇలా తపించిపోయే అఘోరీలు ఉంటారా? అనే కొత్త డౌట్ ప్రజల్లో వ్యక్తమవుతోంది.
భారతదేశ పర్యటన సందర్భంగా రష్యన్ పర్యాటకురాలు ఊహించని విధంగా అఘోరి బాబాను ప్రేమించిందని కథనాలొస్తున్నాయి. వీడియోలో ఆ మహిళ అఘోరిని తన భర్తగా పేర్కొంది. భారతదేశంలోనే సెటిలవుతున్నానని చెప్పింది. రష్యన్ మహిళ కారణంగా అతని తపస్సుకు అంతరాయం కలిగిందా? అని రిపోర్టర్ ప్రశ్నిస్తుంటే, అఘోరి బాబా నవ్వుతూ కనిపించారు. వైరల్ వీడియోలో ఆ మహిళ హిందూ మతంలోకి మారిన తర్వాత అఘోరిని వివాహం చేసుకున్నారట. రష్యన్ యువతి వీపుపై గణేశుడి పచ్చబొట్టు కూడా వేసుకుంది. అలాగే హిందూ మత ప్రాముఖ్యత గురించి కూడా ఆమె మాట్లాడుతోంది.
ఈ జంట ప్రేమకథ సరేకానీ.. అతడికి అఘోరి బాబా గుర్తింపు ఉందా లేదా అనే దాని గురించి కానీ, వివాహం నిజంగా జరిగిందా లేదా? అనే దాని గురించి కానీ ఈ వీడియోలో ఎలాంటి ప్రూఫ్ లేదు. ఒక మీడియా వ్యక్తి ఈ జంటను ఇంటర్వ్యూ చేస్తుంటే దానిని చూసి ప్రజలు అఘోరి- రష్యన్ యువతి ప్రేమకథ నిజమని నమ్ముతున్నారు. అయితే వివాహం ప్రామాణికత గురించి చాలామంది సందేహిస్తున్నారు. ఈ కథ ఇలాంటి వివాహాలకు చట్టబద్ధతపై సందేహాల్ని లేవనెత్తింది. నిజంగా అఘోరి వైవాహిక జీవితాన్ని స్వీకరించగలరా అనే దానిపై ఉత్కంఠభరితమైన చర్చకు దారితీసింది. దీనిని కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేస్తున్నవారు ఉన్నారు.