హీరో ఫేస్ పెట్టుకుని రూ.7 కోట్లు టోకరా!
తాజాగా హాలీవుడ్ స్టార్ నటుడు బ్రాడ్ పింట్ పేరుతో, ఆయన ఫేస్ పెట్టుకుని ఒకడు చేసిన ఘరానా మోసం సోషల్ మీడియా వరల్డ్‌లో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 15 Jan 2025 6:26 AM GMTటెక్నాలజీ పెరిగినా కొద్ది మోసానికి కొత్త టెక్నిక్స్ పెరుగుతున్నాయి. అత్యంత బాధాకర విషయం ఏంటి అంటే ఈ టెక్నాలజీ మోసాల్లో ఎక్కువ శాతం మంది ఉన్నత చదువులు చదువుకున్న వారు ఇరుక్కుంటున్నారు. చదువు రాని వారిని ఒకప్పుడు ఈజీగా మోసం చేసేయవచ్చు అనుకునే వారు. కానీ ఇప్పుడు చదువుకుని టెక్నాలజీని వాడుతున్న వారిని ఈజీగా మోసం చేసేందుకు కొత్త కొత్త పద్దతులను కేటుగాళ్లు వినియోగిస్తున్నారు. ఇండియాలో గత కొన్ని రోజులుగా డిజిటల్ అరెస్ట్ అనే పదం ఎక్కువగా వింటూ ఉన్నారు. ఆ స్కాంలో చాలా మంది కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వారు ఉన్నారు.
ఈమధ్య కొత్తగా వచ్చిన మార్ఫింగ్, ఏఐ ఫేస్ రీ క్రియేట్ టెక్నాలజీలను వినియోగించుకుని మరింతగా మోసాలకు పాల్పడుతున్నారు. వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా ఎంతో మంది ఈ మోసానికి బలి అవుతున్నారు. సినిమా స్టార్స్ ఫేస్ మార్పింగ్‌తో, రాజకీయ నాయకుల ఫోటోల మార్ఫింగ్‌తో చాలానే మోసాలు జరుగుతున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ నటుడు బ్రాడ్ పింట్ పేరుతో, ఆయన ఫేస్ పెట్టుకుని ఒకడు చేసిన ఘరానా మోసం సోషల్ మీడియా వరల్డ్‌లో వైరల్ అవుతోంది. అతడు ఏకంగా రూ.7 కోట్ల రూపాయలను నొక్కేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... 53 ఏళ్ల ఫ్రెంచ్ మహిళకు ఆన్ లైన్ ద్వారా స్కామర్ తాను బ్రాడ్ పిట్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు. మొదట ఆమె అనుమానం వ్యక్తం చేసినా ఆ తర్వాత వీడియో కాల్ చేయడం, ఫోటోలు పంపించడం ద్వారా నమ్మించాడు. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆ ఫోటోలు, వీడియోలు ఆమె పూర్తిగా నమ్మేలా చేశాయి. తాను ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకుంటున్నాను. ఆ కేసు ప్రస్తుతం కేసులో ఉండటం వల్ల నా డబ్బును నేను వాడుకోవడానికి లేదు. ఈ సమయంలో క్యాన్సర్‌తో బాధ పడుతున్న తనకు చికిత్స చేయించుకునేందుకు డబ్బు లేకుండా పోయిందని అవతలి నుంచి మహిళకు మెసేజ్ వచ్చింది.
విడతల వారీగా ఆ స్కామర్‌కి ఏకంగా రూ.7 కోట్లను మహిళ పంపించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో పాటు ఎన్నో రకాల డ్రామాలను ఆ స్కామర్ ఆడాదు. అలా ఏడు కోట్లకు టోకరా వేశాడు. మొత్తం నమ్మేసిన ఆ మహిళ చివరకు విషయం తెలిసి షాక్ అయ్యింది. తాను అంతగా మోసపోయానా అంటూ డిప్రెషన్‌లోకి వెళ్లి పోయింది. ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ఎంతో చదువుకున్నా ఒకానొక సమయంలో అమాయకంగా ఆలోచించి మోసపోతూ ఉంటారు. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులకు డబ్బు ఇచ్చి పుచ్చుకునే సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.