Begin typing your search above and press return to search.

సీజన్‌ 1 పట్టించుకోలేదు... ఐశ్వర్య రాజేష్‌ వల్ల సీజన్‌ 2పై ఆసక్తి

తెలుగు మూలాలు ఉన్న ఐశ్వర్య రాజేష్ గతంలోనే టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు సాలిడ్‌ సక్సెస్ దక్కలేదు.

By:  Tupaki Desk   |   1 March 2025 5:23 AM GMT
సీజన్‌ 1 పట్టించుకోలేదు... ఐశ్వర్య రాజేష్‌ వల్ల సీజన్‌ 2పై ఆసక్తి
X

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ సుదీర్ఘ కాలం తర్వాత ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఏళ్ల తరబడి థియేటర్‌ మొహం చూడని వారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూసేందుకు థియేటర్‌లో అడుగు పెట్టారు. ఇన్నాళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఏ సంక్రాంతి మూవీ దక్కించుకోని భారీ వసూళ్లను, భారీ షేర్‌ను ఈ సినిమా దక్కించుకుంది. సినిమా విజయంలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషించింది. ఆమె యాస, బాడీ లాంగ్వేజ్, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, డైలాగ్స్‌ ఇలా ప్రతి ఒక్కటి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా విజయంలో చాలా ఎలిమెంట్స్ పని చేసినా ఐశ్వర్య రాజేష్ కీలకం అనడంలో సందేహం లేదు.

తెలుగు మూలాలు ఉన్న ఐశ్వర్య రాజేష్ గతంలోనే టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు సాలిడ్‌ సక్సెస్ దక్కలేదు. తమిళంలో మాత్రం స్టార్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగులో ఈ అమ్మడు ఇక మీదట తన జోరు కనబరచే అవకాశాలు ఉన్నాయి. తమిళ్‌లో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'సుజల్‌' అనే వెబ్‌ సిరీస్‌ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో తమిళ్‌లో హిట్‌ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఐశ్వర్య రాజేష్‌తో పాటు ఆ సమయంలో అందులో నటించిన వారు ఎవరికీ పెద్దగా తెలుగులో క్రేజ్ లేదు. దాంతో సుజల్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్ 1కి తెలుగులో పెద్దగా ఆధరణ దక్కలేదు.

మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'సుజల్‌' వెబ్‌ సిరీస్‌కి తాజాగా సీక్వెల్‌ రూపొందింది. సుజల్‌ సీజన్ 2 ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అనూహ్యంగా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని సమాచారం అందుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో సుజల్‌ వెబ్‌ సిరీస్ సీజన్ 1కి వచ్చిన స్పందనతో పోల్చితే సుజల్‌ సీజన్‌ 2 కి దాదాపు రెట్టింపు స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది. పుష్కర్‌-గాయత్రి దర్శక ద్వయం దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌లో ఐశ్వర్య రాజేష్ నటనకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. ఇలాంటి యాక్టింగ్‌ ఓరియంటెడ్‌ పాత్రలకు ఐశ్వర్య రాజేష్ ప్రాణం పోస్తుందని రివ్యూలు వస్తున్నాయి.

ఈ వెబ్‌ సిరీస్‌లో కథిర్‌, గౌరీ కిషన్‌, సంయుక్త మోనిషా బ్లెస్సీ, లాల్‌, శరవణన్‌, మంజిమా మోహన్‌, కాయల్‌ చంద్రన్‌, చాందిన, అశ్విని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సాధారణంగా హీరోయిన్స్‌గా బిజీగా ఉన్న వారు, క్రేజీ హీరోయిన్స్‌గా ఇమేజ్‌ సొంతం చేసుకున్న వారు వెబ్‌ సిరీస్‌లకు కాస్త దూరం ఉంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఇలాంటి ప్రయోగాత్మక సిరీస్‌లను చేస్తుందట. మొదటి సీజన్‌తో పోల్చితే రెండు సీజన్‌కి తెలుగులో మంచి స్పందన దక్కిన నేపథ్యంలో త్వరలోనే మూడో సీజన్‌ను ప్లాన్‌ చేస్తారేమో చూడాలి. ఐశ్వర్య రాజేష్ తెలుగులో తదుపరి సినిమా ఏంటా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.