పెళ్లిలో డ్యాన్సులు సరే కానీ.. ఐష్‌తో ఆడపడుచుకు సరిపడదా?
అలానే మొదలైంది బిగ్ బి కోడలు ఐశ్వర్యారాయ్.. బిగ్ బి కుమార్తె శ్వేతానంద బచ్చన్ మధ్య గొడవ.
By: Tupaki Desk | 25 July 2024 1:30 PM GMTపెళ్లిలో దాండియా డ్యాన్సులు తప్పెటగుళ్లు వగైరా బాగానే ఆడుతారు. బరాత్ ల పేరుతో విందులు వినోదాల్లో మునిగి తేల్తారు. విహార యాత్రలు అంటూ ప్రారంభంలో చాలా అనురాగాలు ఆప్యాయతలు సరదాలు బాగానే ఉంటాయి. కానీ పెళ్లి అయిన కొన్నాళ్ల తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అప్పటికి కొత్త కోడలు నైజం ఏంటో అత్తకు తెలుస్తుంది. అత్త మామలు, ఆడపడుచుల నైజాలు, వ్యవహారాలేంటో కోడలికి అర్థమవుతుంది. ఏదో ఒక రోజు సంక్లిష్ఠమైన ఒక సమస్యతో గొడవ మొదలవుతుంది.
అలానే మొదలైంది బిగ్ బి కోడలు ఐశ్వర్యారాయ్.. బిగ్ బి కుమార్తె శ్వేతానంద బచ్చన్ మధ్య గొడవ. ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వ్యవహారం వెళ్లిందని బాలీవుడ్ మీడియాలో చాలా కాలంగా ప్రచారం ఉంది. అయితే అదే శ్వేతానందా అన్నా వదిన (అభిషేక్- ఐశ్వర్యారాయ్)ల పెళ్లిలో ఎంతగా డ్యాన్సులు ఆడారో చూస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
ఇటీవల ఐశ్వర్యారాయ్- అభిషేక్ విడాకుల ప్రచారం దరిమిలా ప్రస్తుతం వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య-అభిషేక్ అరుదైన వివాహ ఆల్బమ్ పరిశీలిస్తే.. అత్తమ్మ జయాబచ్చన్.. మావయ్య అమితాబ్ బచ్చన్ ల ప్రదర్శనలతో పాటు బారాత్‌లో శ్వేత నందా బచ్చన్ నృత్యాలు హైలైట్ గా కనిపిస్తున్నాయి.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట 20 ఏప్రిల్ 2007న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు పెళ్లయి ఇప్పటికి 17 సంవత్సరాలు అయ్యింది. ఈ జంట వారసురాలు ఆరాధ్య బచ్చన్ ఇప్పటికి టీనేజీ వయసుకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఆ ఇద్దరూ విడిపోతున్నారన్న ప్రచారం బచ్చన్ ల కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. బాలీవుడ్ షాదీస్ డాట్ కాం కథనం లో నాటి పెళ్లి ఫోటోలు, అసలు విషయాలు బయటకు వచ్చాయి. శ్వేతా బచ్చన్ తన సోదరుడు అభిషేక్ బచ్చన్ బారాత్‌లో ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరో ఫోటోలో జయ బచ్చన్ ఎంతో ఆనందంగా కనిపించారు. ఇదే పెళ్లిలో శ్వేతాబచ్చన్ కుమార్తె నవ్వ నవేళి నందా కూడా కనిపించారు. ఈ పెళ్లిలో నీతా లుల్లా డిజైన్ చేసిన 75లక్షల ఖరీదైన చీరలో ఐష్ తళతళా మెరిసిపోయిన ఫోటోలు హైలైట్.