నా కూతురు ఎప్పుడూ నాతోనే..!
దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అవార్డును దక్కించుకుంది.
By: Tupaki Desk | 28 Sep 2024 11:38 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ఇటీవల హాజరు అవుతున్న ప్రతి పబ్లిక్ ఈవెంట్ లలో, పార్టీలలో, అవార్డ్ వేడుకల్లో తన కూతురు ఆరాధ్య తో కలిసి కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఆరాధ్య మొన్నటి వరకు చిన్న పాపగా అనిపించింది. కానీ ఇప్పుడు పెద్ద అమ్మాయిగా మారింది. త్వరలోనే ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అన్నట్లుగా ఆమె కనిపిస్తుంది. అంతే కాకుండా తల్లి చాటు పిల్లలా కాకుండా ప్రత్యేకంగా ఆరాధ్య కనిపిస్తూ మీడియా అటెన్షన్ ను దక్కించుకుంటుంది. తాజాగా ఐఫా వేడుకల్లోనూ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య తో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.
దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అవార్డును దక్కించుకుంది. ఆ అవార్డును అందుకునేందుకు ఆరాధ్య తో ఐశ్వర్య రాయ్ దుబాయ్ వెళ్లడం జరిగింది. అక్కడ మీడియాతో ఐశ్వర్య రాయ్ మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీడియా వారు.. ఆరాధ్య ఎప్పుడూ మీతోనే ఉంటుంది, మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నట్లుంది కదా అంటూ ప్రశ్నించగా ఐశ్వర్య రాయ్ స్పందిస్తూ... తను నా కూతురు, ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేసి అందరి నోరు మూయించారు.
ఐఫా వేడుకల్లో ఎప్పటిలాగే అందమైన రూపంతో, అంతకు మించిన బెస్ట్ ఔట్ ఫిట్ లో ఐశ్వర్యరాయ్ కనిపించింది. ఆరాధ్య సైతం చాలా చక్కనైన ఔట్ ఫిట్ లో సింపుల్ అండ్ స్వీట్ అన్నట్లుగా ఫ్యాన్స్ తో ప్రశంసలు దక్కించుకుంది. ముందు ముందు ఇలాంటి అందాన్ని తల్లి మాదిరిగా మెయింటెన్ చేస్తే కచ్చితంగా బాలీవుడ్ లో రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ హీరోయిన్ గా నిలవడం ఖాయం అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆరాధ్య కు సినిమాలపై ఆసక్తి ఉందా? లేదా? అనే విషయమై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే రాలేదు.
ఐశ్వర్య రాయ్ మాత్రమే కాకుండా ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్, తాత అమితాబ్ బచ్చన్ లు సైతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కనుక ఆరాధ్య సహజంగానే ఇండస్ట్రీ వైపు ఆకర్షితురాలు అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ చాలా మంది నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం ఆసక్తి ఉన్నట్లు ఎక్కడ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఐశ్వర్య రాయ్ సైతం కూతురు ఫ్యూచర్ గురించి ఎక్కడా మాట్లాడిందే లేదు. దాంతో ఆరాధ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి కానీ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు.