Begin typing your search above and press return to search.

న‌ట‌వార‌సుల‌కు గ‌డ్డు కాలం ఊహించిన‌దే!

ఇప్పుడున్న పోటీ ప్ర‌పంచంలో ఎన్ని అండ‌దండ‌లు ఉన్నా స్టార్ గా ఎద‌గ‌డం అంత సులువేమీ కాదు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 1:30 PM GMT
న‌ట‌వార‌సుల‌కు గ‌డ్డు కాలం ఊహించిన‌దే!
X

న‌ట‌వార‌సుల‌కు ఇది గ‌డ్డు కాలం. ప్ర‌తిభ ఎంత ఉన్నా, అందం చందం ఉన్నా కానీ, వెండితెర‌పై వెల‌గాలంటే ఇంకా చాలా కావాలి. ముఖ్యంగా స‌క్సెస్ క‌లిసి రావాలి. న‌టుడిగా నిరూపించుకున్నా విజ‌యానికి ల‌క్ యాడ‌వ్వాలి. పెద్ద బ్యాన‌ర్ల అండాదండా, మంచి రిలీజ్ తేదీ వ‌గైరా ఇటీవ‌లి కాలంలో చాలా విష‌యాల్ని శాసిస్తున్నాయి.

ఇప్పుడున్న పోటీ ప్ర‌పంచంలో ఎన్ని అండ‌దండ‌లు ఉన్నా స్టార్ గా ఎద‌గ‌డం అంత సులువేమీ కాదు. ఈ విష‌యాన్ని ఇంత‌కుముందు బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ స్వ‌యంగా త‌న మాట‌ల్లో చెప్పారు కూడా. మా త‌రంలో త‌ప్పులు చేసినా క్ష‌మించేవారు. కానీ ఈ త‌రానికి అలాంటి అవ‌కాశం లేదు. ప్రేక్ష‌కులు త‌ప్పులు ప‌డుతున్నారు. పైగా క్ష‌మించ‌డం లేద‌ని అజ‌య్ దేవ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసాడు.

ఇలాంటి స‌మ‌యంలో అత‌డి మేనల్లుడు ఆమన్ దేవగన్ వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. అత‌డు న‌టించిన ఆజాద్ చిత్రంతో ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ కూడా తెరంగేట్రం చేస్తోంది. స్టార్ కిడ్స్ ఆరంగేట్రం బంప‌ర్ హిట్టా కాదా అనేది తేలే స‌మ‌యం వ‌చ్చింది. అయితే స్టార్ల‌ న‌ట‌వార‌సులు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా త‌మ‌కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా కొంత‌కాలం పాటు న‌టులుగా మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌రు. అంత స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ అమ‌న్ దేవ‌గ‌న్, రాషా త‌డానీల‌కు ఉన్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహాల్లేవ్.

త‌న‌కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా అమ‌న్ దేవ‌గ‌న్ న‌టించిన తొలి సినిమా రిలీజ్ కాకుండానే రెండో అవ‌కాశం వ‌రించింది. ఇప్పుడు అమ‌న్ దేవ‌గ‌న్ న‌టిస్తున్న రెండో సినిమాని సంస్థ దేవగన్ ఫిల్మ్స్ స్వ‌యంగా పనోరమా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తోంది. దీనికి `జ‌ల‌క్` అని పేరు పెట్టారు. ఇది హార‌ర్ కామెడీ సినిమా. ఇతర వివరాలను నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. తుషార్ అజ్ గావ్కర్ కథను రాస్తుండగా ఉమాంగ్ వ్యాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ముంజ్యా, స్త్రీ 2 చిత్రాల విజ‌యం నేప‌థ్యంలో ఇప్పుడు దేవ‌గ‌న్ లు కూడా అదే బాట‌లో వెళ్ల‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

అయితే వ‌రుస‌గా హార‌ర్ చిత్రాలు విడుద‌ల‌వుతున్న క్ర‌మంలో డెబ్యూ హీరో త‌న సినిమాలో కొత్తేంటి? అన్న‌ది క‌చ్ఛితంగా గుర్తెర‌గాల‌ని విశ్లేషిస్తున్నారు. లేదంటే రొటీన్ హార‌ర్ కామెడీల్లో ఇది కూడా ఒక‌టిగా మిగిలిపోతుంది. న‌టుడిగా కూడా అత‌డికి ఒరిగేదేమీ ఉండ‌ద‌ని విశ్లేషిస్తున్నారు. ఏ డెబ్యూ హీరో అయినా క‌నీసం ఐదారు సినిమాల్లో న‌టిస్తే కానీ అత‌డిని న‌టుడు అని అంగీక‌రించ‌డం క‌ష్టం. అమన్ దేవ‌గ‌న్ ని అజ‌య్ దేవ‌గ‌న్ అంత‌వ‌ర‌కూ నిల‌బెడ‌తాడ‌నే ఆశిద్దాం.