Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో సినిమా సంక్రాంతికి రావడం లేదా?

ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియడం లేదు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 3:15 AM GMT
ఆ స్టార్ హీరో సినిమా సంక్రాంతికి రావడం లేదా?
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'విదా ముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. తునివు తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నారని అభిమానులు ఖుషీ అయ్యారు. ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తాయని, తమ ఫేవరేట్ హీరో నిరంతరం వార్తల్లో ఉంటారని సంతోషించారు. కానీ అజిత్ సినిమాల విషయంలో అలా జరగడం లేదు. రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నా, ఏ సినిమా నుంచి కూడా సరైన అప్డేట్ రావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియడం లేదు.


మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ''విదా ముయార్చి''. లైకా ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ సర్జా, ఆరవ్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది అజిత్ కెరీర్ లో 62వ సినిమాగా ప్రచారం చేయబడింది. ఏడాదిన్నర క్రితమే సెట్స్ మీదకు వెళ్ళింది. కానీ ఎక్కడ దాకా వచ్చింది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనేది క్లారిటీ రావడం లేదు. దసరా, దీపావళి పండుగలు వెళ్లిపోయాయి కానీ.. ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

మరోవైపు 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ''గుడ్ బ్యాడ్ అగ్లీ''. ఇందులోనూ త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. సునీల్, అర్జున్ దాస్, రాహుల్ దేవ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కు మొదటి తమిళ వెంచర్‌ ఇది. దీని కోసం రూ. 270 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొన్నటి వరకూ ఈ చిత్రాన్ని 2025 పొంగల్ కు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రమోట్ చేస్తూ వచ్చారు.

సరిగ్గా నెల రోజుల కిందట 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామంటూ చిత్ర బృందం రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి చప్పుడు లేదు. అదే సమయంలో 'విదా ముయార్చి' చిత్రం పొంగల్‌కి రావచ్చనే ప్రచారం తమిళ మీడియాలో మొదలైంది. నవంబర్ సెకండ్ వీక్ లో సినిమా విడుదల తేదీతో పాటుగా టీజర్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో అజిత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

'విదా ముయార్చి' నుంచి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఎక్స్ వేదికగా తమ నిరసన తెలియజేస్తున్నారు. #UselessLycaProductions, #WorstProductionHouseLyca వంటి హ్యాష్ ట్యాగ్స్ తో నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఎలాంటి అప్డేట్ లేదని, ఎమోషన్స్ తో ఆడుకోవద్దని, అభిమానుల ఆవేదన అర్థం చేసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీలైనంత త్వరగా ఏదైనా అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడ్యూసర్ సుభాస్కరన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

2025 సంక్రాంతికి అసలు అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అవుతుందా? అయితే రెండిటిలో ఏ సినిమా అవుతుంది? ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు? అనే విషయాల మీద ప్రొడక్షన్ హౌస్‌ల నుండి ఫ్యాన్స్ క్లారిటీ కోరుకుంటున్నారు. పండక్కి ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి, ఏ సమాచారం వెంటనే ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ఒకవేళ అజిత్ సినిమా పొంగల్ కు వచ్చినా, తెలుగులో మాత్రం మంచి రిలీజ్ దొరికే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' 'సంక్రాంతికి వస్తున్నాం' 'NBK 109' 'మజాకా' లాంటి నాలుగు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటి మధ్య తమిళ డబ్బింగ్ చిత్రానికి తగినన్ని థియేటర్లు దొరకడం కష్టమే. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.