Begin typing your search above and press return to search.

సినిమాలు రేసింగ్‌లపై త‌ళా క్లారిటీ మిస్సింగ్?

సినిమాలు ఓవైపు.. మోటార్ రేసింగులు, ప‌ర్వ‌తాల్లో బైక్ అడ్వెంచర్లు మ‌రోవైపు... వీట‌న్నిటినీ త‌ళా అజిత్ ఎలా మ్యానేజ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 3:52 AM GMT
సినిమాలు రేసింగ్‌లపై త‌ళా క్లారిటీ మిస్సింగ్?
X

సినిమాలు ఓవైపు.. మోటార్ రేసింగులు, ప‌ర్వ‌తాల్లో బైక్ అడ్వెంచర్లు మ‌రోవైపు... వీట‌న్నిటినీ త‌ళా అజిత్ ఎలా మ్యానేజ్ చేస్తున్నారు. సినిమాలు చేసేప్పుడు మోటార్ రేసింగ్ పోటీల‌ను ఎలా కొన‌సాగించ‌గ‌ల‌డు? రెండిటికీ క్లాష్ రాదా? ఇలాంటి సందేహాలెన్నో చాలా కాలంగా త‌ళా అజిత్ కుమార్ అభిమానుల‌ను వేధిస్తూనే ఉన్నాయి.

ఎట్ట‌కేల‌కు అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌ళా స‌మాధాన‌మిచ్చారు. తాను మోటార్ రేసింగులు ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి సినిమాలు పూర్తి చేస్తాన‌ని తెలిపారు. అక్టోబ‌ర్ నుంచి మార్చి మ‌ధ్య కాలంలో సినిమాల్లో న‌టించ‌వ‌చ్చ‌ని, ఆ త‌ర్వాత పూర్తిగా మోటార్ రేసింగ్ ఈవెంట్ల‌పై దృష్టి సారిస్తాన‌ని అజిత్ తెలిపారు. 24H దుబాయ్ 2025 రేసింగులో పాల్గొంటున్న సందర్భంగా అజిత్ కుమార్ త‌న వ‌ర్క్ బ్యాలెన్స్ గురించి మాట్లాడారు. సినిమా క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేస్తూనే, వాటికి అడ్డంకి లేకుండా రేసింగ్ లో పాల్గొంటాన‌ని అజిత్ వెల్ల‌డించారు.

గ‌తంలో తాను 24 గంట‌ల‌ మోటార్ రేసింగుల్లో పాల్గొన్న‌ప్పుడు కొన్ని సినిమా క‌మిట్ మెంట్ల కార‌ణంగా మ‌ధ్య‌లోనే రేసింగ్ ని వ‌దిలేయాల్సి వ‌చ్చింద‌ని కూడా తెలిపాడు. మోటార్ రేసింగ్ ప్రారంభానికి ముందు తాను సినిమాల‌కు సంత‌కాలు చేయ‌న‌ని కూడా వెల్ల‌డించారు. 13 సంవత్సరాల తర్వాత ఇంత‌కాలానికి దుబాయ్ లో జ‌రుగుతున్న‌ రేసింగ్ ట్రాక్‌లోకి తిరిగి వచ్చాడు. 24H దుబాయ్ 2025 కోసం అర్హత సెషన్‌లో అత‌డు తన కెరీర్ బ్యాలెన్స్ గురించి మాట్లాడాడు. క్వాలిఫైయింగ్ సెషన్ నుండి అజిత్ కుమార్ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అభిమానులు ఎవరూ ఆందోళన చెందకుండా ఉండటానికి నేను సినిమాల్లో నటిస్తాను. నేను రేసింగ్‌లో పూర్తి వేగంతో ఉండగలను అని కూడా అజిత్ అన్నారు. ప్రస్తుతానికి నేను డ్రైవర్‌గా మాత్రమే కాకుండా, జట్టు యజమానిగా కూడా మోటార్‌స్పోర్ట్స్‌ను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నానని తెలిపారు.

నేను బైక్ రేసింగ్ ల‌ను 18 ఏళ్ల వ‌య‌సులో ప్రారంభించాను. 20-21 సంవత్సరాల వరకు కొన‌సాగించాను. 1993 వరకు బైక్ రేసింగ్ కొన‌సాగింది. అటుపై సినీపరిశ్రమలోకి వచ్చాను. 2002లో నేను మోటార్ రేసింగ్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు 32 సంవత్సరాలు. కానీ ఈసారి బైక్ రేస్ కాదు కార్ రేస్ లోకి వ‌చ్చాను అని తెలిపాడు. 2002లో మోటార్‌స్పోర్ట్స్‌కు తిరిగి వచ్చానని భారతదేశంలో జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాన‌ని కూడా అజిత్ వెల్ల‌డించారు.

ఇంకా రేసింగ్ జ‌ర్నీ గురించి అజిత్ మాట్లాడారు. ``నేను 2003లో బీఎండ‌బ్ల్యూ చాంపియ‌న్ షిప్ ని పూర్తి చేసాను. 2004లో స్కాలర్‌షిప్ తరగతిలో బ్రిటిష్ ఫార్ములా 3లో పాల్గొన్నాను. కానీ దురదృష్టవశాత్తు సినిమాల కార‌ణంగా సీజ‌న్‌ను పూర్తి చేయలేకపోయాను. 2010లో యూరోపియన్ ఫార్ములా 2 సీజన్‌లో రేసులో పాల్గొనే అవకాశం లభించే అదృష్టం నాకు కలిగింది. కానీ మళ్ళీ నా సినిమా కమిట్‌మెంట్‌ల కారణంగా కుద‌ర‌లేదు. కొన్నిటిని మాత్ర‌మే చేయ‌గ‌లిగాను`` అని అజిత్ తెలిపారు. ఈ ప్ర‌యాణం ఒకేసారి రెండు పడవలను బ్యాలెన్స్ చేయడం లాంటిదని కూడా అన్నారు. కానీ ఇప్పుడు కేవ‌లం సినిమాల కోసం కొంత స‌మ‌యం, రేసింగుల కోసం మ‌రికొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నాన‌ని అజిత్ వెల్ల‌డించారు. అజిత్ న‌టించిన `విధాముయార్చి` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలోను అజిత్ న‌టిస్తున్నాడు.