Begin typing your search above and press return to search.

అజిత్ కు పద్మ భుషణ్ అవార్డు... తెరపైకి పొలిటికల్ చర్చ!

సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు అజిత్ కుమార్ ను దేశంలోనే మూడో అతున్నత పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   26 Jan 2025 4:25 PM GMT
అజిత్ కు పద్మ భుషణ్ అవార్డు... తెరపైకి పొలిటికల్ చర్చ!
X

సినీ రంగానికి చేసిన సేవలకు గానూ నటుడు అజిత్ కుమార్ ను దేశంలోనే మూడో అతున్నత పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై స్పందించిన అజిత్.. పద్మభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆ సంగతి అలా ఉంటే.. ఈ ఎంపికపై తమిళనాట రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది.

అవును.. కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సహచరులు అభినందనలు తెలిపారు. ఆ సంగతి అలా ఉంటే.. అజిత్ కు పద్మభూషణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... అతని సమకాలీనులైన విజయ్, విక్రమ్, సూర్యతో పోల్చినప్పుడు అజిత్ అదే స్థాయిలో ప్రజాదరణ, కళా సేవలను కలిగి ఉన్నారని వాదిస్తున్నారు. ఇదే సమయంలో.. అజిత్ కు ఆ అర్హత ఉందనేవారూ బాగానే ఉన్నారు. వాస్తవానికి కోలీవుడ్ లో శివాజీ గణేశన్, రజనీ, కమల్, విజయ్ కాంత్ లకు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారని గుర్తు చేస్తున్నారు.

అయితే.. వీరంతా అనుభవజ్ఞులు, లెజెండ్ లుగా పరిగణించబడుతున్నారని.. అజిత్ కు ఆ అర్హత వచ్చి ఉంటే విజయ్, విక్రమ్, సూర్య కూడా వచ్చినట్లే అనేది వీరి వాదన. ఈ క్యాజువల్ అభిప్రాయాలు, విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే.. అజిత్ కు పద్మభూషణ్ ఇవ్వడం వెనుక బీజేపీ రాజకీయ చాణక్యం ఉందనే చర్చ ఆసక్తిగా మారింది.

ఇందులో భాగంగా... అజిత్ కు అవార్డు ఇవ్వడం వెనుక బీజేపీ రాజకీయం ఉందని దళపతి విజయ్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో ఎంజీఆర్, కమల్ హాసన్ లు పార్టీలు పెట్టినప్పుడు శివాజీ గణేశన్ కు, రజనీకాంత్ లకు ఇలాగే దాదాసాహెబ్ పాల్కే అవార్డులు ఇచ్చిందని.. ఇప్పుడు అదే కోణంలో తమ హీరో విజయ్ పార్టీ పెట్టగానే అజిత్ కు అవార్డుతో కౌంటర్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని అంటున్నారు.

కాగా... పద్మభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పినా అజిత్... ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా.. తనకు సినీపరిశ్రమలో ఎంతో మంది సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.