పట్టుబట్టి మరీ 'పట్టుదల' సాధించారా?
తాజాగా అజిత్ నుంచి ఇదే నెలలో `విదాముయార్చీ` రిలీజ్ అవుతుంది. వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాలి. కానీ ఇదే నెలలో మరో తేదీకి వాయిదా వేసారు.
By: Tupaki Desk | 16 Jan 2025 2:30 PM GMTడబ్బింగ్ చిత్రాల రిలీజ్ విషయంలో ఈ మధ్య కొత్త పోకడ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. మాతృక భాషతోనే అన్ని భాషల్లోనూ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు తమిళ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందంటే? దానికి పర్పెక్ట్ తెలుగు టైటిల్ ఫిక్స్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాన్ ఇండియా పేరో? టైటిల్ మారిస్తే మీనింగ్ మారిపోతుందని మరో కారణమో చెప్పి మాతృక టైటిల్తోనే చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
ఆ మధ్య రిలీజ్ అయిన రజనీకాంత్ `వెట్టేయాన్` ఇదే తమిళ్ టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయింది. అంతకు ముందు అజిత్ నటించిన `వలిమై` కూడా ఇదే టైటిల్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. `రాయన్`, `తంగలాన్`, `కంగువ` కూడా తమిళ టైటిల్ తోనే అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యాయి. అవేవి కూడా సరిగ్గా ఆడలేదు. ఈ నేపథ్యంలో తమిళ టైటిల్స్ తో తెలుగు రిలీజ్లు ఏంటి? అనే అసంతృప్తి అభిమానుల్లో కనిపించింది. అందమైన తెలుగు టైటిల్ తో రిలీజ్ చేయడానికి సమస్య ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో అజిత్ `తనీవు` చిత్రం టైటిల్ విషయంలో వెంటనే అలెర్ట్ అయ్యారు.
ఆ సినిమాకు తెలుగు టైటిల్ ` తెగింపు` గా పెట్టి రిలీజ్ చేసారు. తాజాగా అజిత్ నుంచి ఇదే నెలలో `విదాముయార్చీ` రిలీజ్ అవుతుంది. వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాలి. కానీ ఇదే నెలలో మరో తేదీకి వాయిదా వేసారు. విదాముయార్చీ అదిరిపోయే తెలుగు టైటిల్ ఫిక్స్ అయింది. `పట్టుదల` అనే టైటల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది.
భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి `పట్టుదల` అనే టైటిల్ పెట్టడంతో సినిమా పై ఓ అంచనాకి కూడా ప్రేక్షకుడు రాగలుగుతున్నాడు. ఇది ఎలాంటి సినిమా అయి ఉంటుందనే గెస్ కలుగుతుంది. తెలుగు టైటిల్ లో రిలీజ్ అయిన సినిమాలకు సక్సస్ రేట్ బాగుంది. ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి కూడా తెలుగు టైటిల్స్ దోహద పడుతున్నాయి. అలాగే `పట్టుదల` ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు.