కమల్ హాసన్ - అజిత్‌లా టాలీవుడ్ స్టార్ హీరోలు కోరతారా?
అభిమానం హద్దు మీరితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గ్రహిస్తున్నారు స్టార్ హీరోలు. తమ పేరుకు ముందు బిరుదులను ఉపయోగించడం లేదా అతిశయోక్తి పదాలను ఉపయోగించడం వారికి నచ్చడం లేదు.
By: Tupaki Desk | 11 Dec 2024 12:30 PM GMTఅభిమానం హద్దు మీరితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గ్రహిస్తున్నారు స్టార్ హీరోలు. తమ పేరుకు ముందు బిరుదులను ఉపయోగించడం లేదా అతిశయోక్తి పదాలను ఉపయోగించడం వారికి నచ్చడం లేదు. ఇంతకుముందు విశ్వనటుడు కమల్ హాసన్ తన పేరుకు ముందు ఉలగనాయగన్ (విశ్వనటుడు) లాంటి బిరుదులు అవసరం లేదని అభిమానులు తనను సింపుల్ గా కమల్ అని పిలవాలని కోరారు.
ఇప్పుడు తళా అజిత్ కూడా ఇంచుమించు అలాంటి అభ్యర్థనతో అభిమానుల ముందుకు వచ్చారు. అతిశయోక్తి పిలుపు సందర్భం గురించి ప్రస్థావిస్తూ తన అసౌకర్యాన్ని బయటపెట్టారు. తన పేరుతో వైరల్ అయిన `కడవూలే అజితే` నినాదం ఇకపై మానేయాలని తన అభిమానులను అభ్యర్థిస్తూ అజిత్ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నినాదాలు శ్లోకాలు ఉపయోగించడం తనకు ఇష్టం లేదని అజిత్ అన్నారు. ఆంగ్లం- తమిళం రెండింటిలో విడుదల చేసిన ప్రకటనలో అజిత్ తన అభిమానులకు కొన్ని విషయాలపై దిశానిర్ధేశనం చేసారు. తన పేరు పక్కన పేర్కొన్న ఏవైనా అతిశయోక్తి పదాలు లేదా బిరుదులను ఉపయోగించకుండా ఉండమని తన అభిమానులను కోరాడు.
ఒక నిర్దిష్ట అంశం కలవరపెడుతోంది. ప్రత్యేకించి, K...., అజితే! అనే నినాదం ఈవెంట్‌లు, బహిరంగ సభలలో వినిపిస్తున్నాయి. దీంతో నేను అసౌకర్యంగా ఉన్నాను. బహిరంగ ప్రదేశాలలో ఈ నినాదాలు దయచేసి ఆపండి. నిగ్రహించుకోండి.. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, ఎవరినీ నొప్పించకుండా జీవించాలని నా హృదయపూర్వక అభ్యర్థన. మీరు మీ కుటుంబాలను బాగా చూసుకోండి.. చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఉండండి.. జీవించనివ్వండి! అని అజిత్ ఈ ప్రకటనలో తెలిపారు.
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ కూడా తన పేరును ప్రస్తావించేటప్పుడు `ఉలగనాయగన్` వంటి ట్యాగ్‌లను ఉపయోగించవద్దని తన అభిమానులు, ప్రేక్షకులు, మీడియా సహా సినీ పరిశ్రమ వ్యక్తులను కోరారు. ప్రతి ఒక్కరూ తనను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కెహెచ్ అని పిలవాలని కూడా ఆయన అభ్యర్థించారు. కళారంగంలో తాను నేర్చుకుని ఎదిగేందుకు ఇష్టపడతానని కమల్ అన్నారు.
అజిత్, కమల్ హాసన్ తరహాలోనే ఇకపై టాలీవుడ్ హీరోలు కూడా తమ పేర్లకు ముందు అతిశయోక్తి పదాలు, బిరుదులు ఆపాలని తమ అభిమానులను కోరతారా లేదా వేచి చూడాలి.