Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజ‌ర్‌కి త‌ళా ఛాలెంజ్

2025 సంక్రాంతి బ‌రిలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `గేమ్ ఛేంజ‌ర్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:31 AM GMT
గేమ్ ఛేంజ‌ర్‌కి త‌ళా ఛాలెంజ్
X

2025 సంక్రాంతి బ‌రిలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `గేమ్ ఛేంజ‌ర్` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతి బ‌రిలోనే బాల‌కృష్ణ న‌టించిన `డాకు మ‌హారాజ్,` వెంక‌టేష్ న‌టించిన `సంక్రాంతికి వ‌స్తున్నాం` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ రేసులో ఉండ‌గా, ఇప్పుడు త‌మిళం నుంచి త‌ళా అజిత్ కూడా సంక్రాంతి బ‌రిలోనే పోటీకి దిగుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అజిత్ న‌టించిన విదాముయార్చి త‌మిళంతో పాటు తెలుగు వెర్ష‌న్ కూడా రిలీజ్ చేయ‌నుండ‌గా, ఈ సినిమాని 10 జ‌న‌వ‌రి 2025న విడుద‌ల చేస్తార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఈ చిత్రానికి మాగిజ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

విదాముయార్చి చివరి ద‌శ షూట్‌ల కోసం టీమ్ బ్యాంకాక్ కు చేరుకుంది. అజిత్ - త్రిష జంట‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర‌బృందం ఈ జంట‌కు సంబంధించిన స్టైలిష్ ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. త‌ళా అజిత్- త్రిష ఒక‌రికొక‌రు చేతిలో చెయ్యి వేసి న‌డుచుకుంటూ వ‌స్తున్న ఈ దృశ్యం క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది. అజిత్ - త్రిష కోలీవుడ్ లో హిట్ పెయిర్ గా పాపుల‌ర‌య్యారు. ఈ జంట క‌లిసి నాలుగు సినిమాల్లో న‌టించారు. ఇప్పుడు ఐదోసారి జంట‌గా న‌టిస్తున్నారు.

తాజాగా విదాముయార్చి సెట్ నుంచి విడుద‌లైన ఫోటోల్లో అజిత్‌ స్టైలిష్ బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ సూట్ లో క‌నిపించారు. అజిత్ చేతిలో చేయి వేసి స్టైలిష్ గా న‌డిచి వ‌స్తున్న త్రిష ఎరుపు రంగు ఆర్గాన్జా చీర -ఎరుపు పూల బ్లౌజ్ ధ‌రించి మంత్రముగ్దులను చేసింది. ఇద్దరూ హ్యాపీగా చేతిలో చెయ్యేసి నడుస్తూ కనిపించారు. అజిత్ సన్ గ్లాసెస్‌ని ధ‌రించి ఫార్మ‌ల్ సూట్ లో అద‌ర‌గొట్టాడు. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. బ్యాంకాక్ లో చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే చిత్ర‌బృందం తిరిగి చెన్నైకి వ‌స్తుంది. అక్క‌డ షూటింగ్ ని కొన‌సాగిస్తుంది.

విదాముయార్చిలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజిత్ తదుపరి `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో కనిపించనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్-కామెడీ 2025 వేసవిలో విడుద‌ల‌వుతుంది.