ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే తళా చేసిన పనికి షాక్!
తళా అజిత్ ఆస్పత్రిలో చేరగానే తమిళ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి
By: Tupaki Desk | 13 March 2024 6:18 PM GMTతళా అజిత్ ఆస్పత్రిలో చేరగానే తమిళ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. అతడి ఆరోగ్యం అంతగా బాలేదని బ్రెయిన్ సర్జరీ జరుగుతోందని రకరకాల పుకార్లు పుట్టించడంతో అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇవేవీ నిజాలు కావని అతడి చెవి నరానికి సంబంధించిన చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిందని ఆ తర్వాత మీడియాలో సవరణ కథనాలు వెలువడడంతో అభిమానులు శాంతించారు.
ఈ ప్రాసెస్ లో అజిత్ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఐసియు నుంచి సాధారణ గదికి వచ్చి అతడు పూర్తిగా కోలుకున్నాడు. నిజానికి ఆస్పత్రిలో అజిత్‌ను కేవలం ఒక రోజు మాత్రమే అబ్జర్వేషన్‌లో ఉంచారు. తరువాత డిశ్చార్జ్ చేశారు. అతడు తన కుమారుడి పాఠశాలలో తన భార్య షాలిని స్నేహితులతో సమావేశమై కనిపించాడు. తన కొడుకు ఆద్విక్ కి ఫుట్‌బాల్ బూట్‌లు ధరించడంలో సహాయం చేస్తూ కనిపించాడు. అజిత్ కుమార్ - షాలిని - ఆద్విక్ మధ్య అరుదైన ఆరాధనీయమైన క్షణమిది. ఇది అజిత్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు ఉపశమనం కలిగించింది.
అజిత్ ఫక్తు ఫ్యామిలీ మ్యాన్. అన్నిటికంటే తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులకు ఇది తెలుసు. ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకు ఆద్విక్ పుట్టినప్పటి నుండి అజిత్ తన కుటుంబంపై దృష్టి పెట్టడానికి సినిమాలను కూడా తగ్గించుకున్నారు.
తాజాగా షాలిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో అజిత్ క్రీమ్ ఆలివ్ షర్ట్.. సౌకర్యవంతమైన జీన్స్ ధరించి, స్టైలిష్ స్నీకర్స్‌తో కనిపించాడు. 52 సంవత్సరాల వయస్సులో ఫ్యాషన్ గేమ్‌లో తనను మించేవారే లేరని అజిత్ నిరూపిస్తున్నాడు. ``మీరు గెలవలేరు అని మాకు చెప్పగలిగేది మీరే.. మీరు వినాల్సిన అవసరం లేదు`` అని నర్మగర్భ వ్యాఖ్యను షాలిని జోడించింది. వారి వారసుడు ఆద్విక్ విపరీతమైన ఫుట్‌బాల్ అభిమాని. గతంలో చెన్నైలో నిర్వహించిన జూనియర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అజిత్ తన తదుపరి చిత్రం విదా ముయార్చి రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ అతని చెవి నరాలకు శస్త్రచికిత్స జరిగాక విశ్రాంతిలో ఉన్నారు. విడా ముయార్చి కాకుండా అజిత్ మార్క్ ఆంటోని మూవీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో AK63 అనే చిత్రానికి సంతకం చేశారు. విడా ముయార్చి విడుదల తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారు.