సూపర్ స్టార్లలో ఈ సూపర్ స్టార్ పాలసీయే వేరయా!
అలానే అజిత్ కుమార్ తన సినిమాలకు ప్రమోషన్స్ చెయ్యరు. ప్రెస్ మీట్లు, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఇతర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనరు.
By: Tupaki Desk | 27 July 2024 5:44 AM GMTతమిళ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి, తన స్వయంకృషితో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకొని, గత మూడు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్నారు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. అయితే అంత పెద్ద హీరో అయినప్పటికీ, మిగతా అగ్ర హీరోలతో కంపేర్ చేసి చూసినప్పుడు అజిత్ వారి కంటే చాలా భిన్నంగా కనిపిస్తారు.
ఇండియన్ సినిమాలో హీరోలందరికీ ట్యాగ్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. ఆ స్టార్ ఈ స్టార్ అంటూ ఏదొక టైటిల్ తో పిలవబడుతుంటారు. ప్రతీ హీరో పేరు ముందు ప్రీ పిక్స్ ఉండటం అనేది కామన్. అజిత్ కుమార్ ను కూడా ఆయన అభిమానులు 'తలా' అని ముద్దుగా పిలుచుకుంటారు. తమిళంలో తలా అంటే నాయకుడు అని అర్ధం. అయితే అజిత్ మాత్రం తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్స్ వాడవద్దని రిక్వెస్ట్ చేశారు. అందరు హీరోల మాదిరిగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఉండరు.
అలానే అజిత్ కుమార్ తన సినిమాలకు ప్రమోషన్స్ చెయ్యరు. ప్రెస్ మీట్లు, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఇతర ప్రచార కార్యక్రమాలలో పాల్గొనరు. సైలెంట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తారు.. థియేటర్లలో విడుదల చేస్తారు. కొన్ని సినిమాలకైతే కనీసం పోస్టర్లు కూడా ఉండవు. ఏదో ఫ్యాన్స్ కోసం ప్రొడక్షన్ హౌసెస్ ఫస్ట్ లుక్స్, వర్కింగ్ స్టిల్స్ విడుదల చేస్తుంటారు. రిలీజ్ డేట్ పోస్టర్లు వేయకపోయినా, ప్రమోషన్స్ చేయకపోయినా తమిళనాడు వరకూ అజిత్ సినిమాకి ఎప్పుడూ ఓపెనింగ్స్ కు డోకా లేదు. ఎందుకంటే ఆయనకు అంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
సినిమా హిట్టయినా కూడా ఎక్కడా కూడా హడావిడి ఉండదు. సక్సెస్ మీట్ లు, సెలబ్రేషన్స్ అంటూ అజిత్ ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించరు. మూవీ ఫ్లాప్ అయినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. వెంటనే మరో సినిమా షూటింగ్ కు వెళ్ళిపోతారు. ఇక ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడా ప్రదర్శించరు. లగ్జరీ కార్లున్నా, సామాన్యుడిలా ఆటోలో వెళ్తూ కనిపిస్తారు. పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం, ఓటు వెయ్యడానికి అందరిలానే క్యూలో నిలబడతారు. సెలబ్రిటీ అనే హంగూ ఆర్భాటం అస్సలు కనిపించదు. అందుకే ఆయన్ను 'మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ' అంటారు.
సేవా కార్యక్రమాలతోనూ అజిత్ కుమార్ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఫ్యాన్స్‌కు కష్టం వస్తే నేనున్నానంటూ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తన వద్ద పని చేసే సిబ్బందికి సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి తన మంచి మనసును చాటుకున్నారు. స్టార్ హీరోగా ఉన్నప్పటికీ తన ఇష్టాలను ఎప్పుడూ వదులుకోలేదు. దేశంలోనే బెస్ట్ బైక్ రేసర్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఫార్ములా రేసింగ్ లోనూ ఆయన అనేక ఘనతలు సాధించారు. గన్ ఫైరింగ్ లోనూ ప్రావీణ్యం సంపాదించారు. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ లలో మెడల్స్ గెలుపొందారు. ఏరో మోడలింగ్ పై ఉన్న ఆసక్తితో పైలెట్ లైసెన్స్ కూడా పొందారు. ఇలా అనేక విషయాల్లో అజిత్ మిగతా హీరోలకంటే ప్రత్యేకంగా నిలుస్తారు.
అజిత్ కుమార్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మూవీ చేస్తున్నారు. ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.