Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌ని లేపేయ‌డానికి AK-47 ఆర్డర్‌ ఇచ్చారు!

ఇదిలా ఉండ‌గానే సల్మాన్ ని లేపేసేందుకు పాకిస్తాన్‌కి ఏకే 47 ఆర్డర్‌ ఇచ్చారని తాజా విచార‌ణ‌లో నిగ్గు తేలింది. తాజా క‌థనాల ప్రకారం.. నేడు (శ‌నివారం) మ‌రో న‌లుగురు నిందితులు ప‌ట్టుబ‌డ్డారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 9:50 AM GMT
స‌ల్మాన్‌ని లేపేయ‌డానికి AK-47 ఆర్డర్‌ ఇచ్చారు!
X

స‌ల్మాన్ ఖాన్ వ‌ర్సెస్ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ ఎపిసోడ్స్ ఒక ఫీచ‌ర్ సినిమాకి ఎంత‌మాత్రం త‌క్కువ కాద‌ని ప్రూవ్ అవుతోంది. కృష్ణ‌జింకను వేటాడిన స‌ల్మాన్‌ని 'క‌ర్మ' అనుస‌రిస్తోంది. త‌మ కుల‌దైవ‌మైన కృష్ణ జింక‌ను హ‌త‌మార్చిన స‌ల్మాన్ ని చంపేందుకైనా వెన‌కాడ‌న‌ని గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ గ‌తంలో చాలా వార్నింగులు ఇచ్చాడు. ఇటీవ‌ల స‌ల్మాన్ ఇంటిపై తుపాకుల దాడి ఘ‌ట‌న‌తో అత‌డి పేరు మ‌రోసారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగింది. ఎవ‌రీ బిష్ణోయ్.. స్టార్ హీరోని హ‌త‌మార్చేందుకు ఎందుకు ఇంత‌గా త‌పిస్తున్నాడు? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

ఇదిలా ఉండ‌గానే సల్మాన్ ని లేపేసేందుకు పాకిస్తాన్‌కి ఏకే 47 ఆర్డర్‌ ఇచ్చారని తాజా విచార‌ణ‌లో నిగ్గు తేలింది. తాజా క‌థనాల ప్రకారం.. నేడు (శ‌నివారం) మ‌రో న‌లుగురు నిందితులు ప‌ట్టుబ‌డ్డారు. పన్వేల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసినందుకు గాను లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు ANI వెల్ల‌డించింది. లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ సహా 17 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో నిందితుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది.

పోలీసులకు పట్టుబడిన నిందితులు పాకిస్తాన్ నుండి ఆయుధాలను సేకరించి, సల్మాన్ ఖాన్‌పై దాడి చేసి, ఆపై శ్రీలంకకు పారిపోవాలని ప్లాన్ చేసార‌ని విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు వెల్ల‌డించారు. ముంబై పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌లుగా గుర్తించారు. దాడి చేసేందుకు నిందితులు సల్మాన్‌ఖాన్‌ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో రెక్కీ చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడు అజయ్ కశ్యప్ పాకిస్తాన్‌లోని డోగర్ అనే వ్యక్తిని వీడియో కాల్ ద్వారా సంప్రదించాడు. పాక్ నుండి AK-47 వంటి ఆయుధాల‌ను ఇక్క‌డకు పంపించాల్సిందిగా ఆర్డర్ చేసారు. లారెన్స్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా ముఠాలోని దాదాపు 60 నుంచి 70 మంది కుర్రాళ్లు ముంబై, రాయగఢ్, నవీ ముంబై, థానే, పూణే, గుజరాత్ నుంచి వచ్చి సల్మాన్ ఖాన్‌పై నిఘా ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది.

నవీ ముంబై పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మైనర్‌లను ఉపయోగించి సల్మాన్ ఖాన్‌పై దాడి చేసి దేశం విడిచి పారిపోవాలనేది ప్లాన్. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఇండియావియా బోటు నుంచి శ్రీలంకకు పారిపోవాలని నిందితులు ప్లాన్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ నివసించే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై తుపాకీ కాల్పులు క‌ల‌క‌లం అనంత‌రం తాజా ప‌రిణామ‌మిది. ఏప్రిల్ 14న హౌసింగ్ సొసైటీ వెలుపల ఉన్న ఖాన్ ఇంటి వైపు కాల్పులు జరిపిన వ్యక్తి ఈ సంఘటనలోని CCTV ఫుటేజీలో క‌నిపించాడు. ఆ త‌ర్వాత కూపీ లాగిన పోలీసులు ప‌ట్టుకున్న నిందితుల నుంచి డొంకంతా క‌దుపుతున్నారు.

విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు వ్యక్తులను ఇదివ‌ర‌కూ గుజరాత్‌లో అరెస్టు చేశారు. వీరిద్దరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. ఈ కేసులో మూడో నిందితుడు అనుజ్ థాపన్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అయితే మూడో నిందితుడు థాపన్ మే 1న ముంబై పోలీసు క్రైం బ్రాంచ్‌లోని లాకప్‌లోని టాయిలెట్‌లో మరణించాడు. ఆ త‌ర్వాత ప‌లు ద‌ఫాలుగా ఈ గ్యాంగ్ తో సంబంధం ఉన్న కుట్ర‌దారులంద‌రినీ పోలీసులు ప‌ట్టుకుంటున్నారు. స‌ల్మాన్ పై ఎటాక్ కేసును ముంబై పోలీసులు ఎంత సీరియ‌స్ గా తీసుకున్నారో ఈ ఉదంతాలు చెబుతున్నాయి.