21 కోట్లు అందుకునే నటిపై 4 సినిమాల నటుడు విమర్శలా?
ఇటీవల స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడి దాడి ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Feb 2025 5:47 AMఇటీవల స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడి దాడి ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత ముంబైలో స్టార్లు, సెలబ్రిటీల రక్షణపై చాలా సందేహాలు తలెత్తాయి. సరైన భద్రత లేకుండానే వారంతా నివశిస్తున్నారా? అంటూ విమర్శలు ఎదురయ్యాయి. దోపిడీ కోసం బాంద్రాలోని ఇంట్లోకి జొరబడిన దుండగుడి దాడిలో సైఫ్ - కరీనా కపూర్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ రాత్రి అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ నిద్రపోయాడు. ధనికులైన వారి కుటుంబానికి పర్సనల్ సెక్యూరిటీ లేనే లేదు. అలాగే డజన్ల కొద్దీ కార్లు ఉండే సైఫ్ కి రాత్రి పూట డ్రైవర్ కూడా అందుబాటులో లేడు. ఆయనను ఆసుపత్రికి తరలించడానికి ఆటోని ఆశ్రయించాల్సి వచ్చింది. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకుని ఒక వారంలో కోలుకున్నా కానీ వారికి సెక్యూరిటీ లేకపోవడం గురించి, డ్రైవర్ ని నియమించుకోకపోవడం గురించి చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల నటుడు ఆకాశ్ దీప్ సబీర్.. అతడి భార్య షీబా సెక్యూరిటీ గార్డు, పూర్తి సమయం పని చేసే డ్రైవర్ ని నియమించుకోలేని స్థితిలో ఉన్నారా? అంటూ సైఫ్- కరీనా దంపతులను నిలదీసారు.
ఓ ఇంటర్వ్యూలో ఆకాశ్ దీప్ - షీబా పరిశ్రమలో వేతన అసమానత గురించి మాట్లాడారు. పుష్పలో ప్రేక్షకులను థియేటర్ వైపు ఆకర్షించడానికి రష్మిక మందన్న కారణం కాదు.. అల్లు అర్జున్ కారణమని వారు వాదించారు. పుష్ప చిత్రం కోసం రష్మిక రూ. 10 కోట్లు అందుకుందని, అల్లు అర్జున్ రూ. 100 కోట్లకు పైగా సంపాదించారని వారు వివరించారు. అదే సమయంలో ఆకాష్‌దీప్ కరీనా కపూర్‌ను తీవ్రంగా విమర్శించారు. బెబో రూ. 21 కోట్ల పారితోషికం అందుకుంటున్నా కానీ, తన ఇంటికి సెక్యూరిటీ గార్డును ఎందుకు నియమించుకోలేరని అడిగారు. ఇలాంటి తారలకు రూ. 100 కోట్లు చెల్లిస్తే వారు రాత్రిపూట సెక్యూరిటీ లేదా డ్రైవర్‌ను భరించగలరని సెటైర్ వేసాడు.
చిన్నతనంలో కరీనాను కలిసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. టీవీ చర్చలలో తాను కరీనా- సైఫ్‌కు కెరీర్ ఆరంభం అండగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటికి కరీనా నటి కాదు.. చిన్నపిల్ల అని, సహారాలో కరీనా సోదరి కరిష్మా కపూర్ నటించిన తొలి చిత్రానికి తాను దర్శకత్వం వహించి నిర్మించానని ఆయన పేర్కొన్నారు.
సైఫ్ -కరీనాలను గౌరవప్రదమైన జంటగా అభివర్ణించిన అతడు ఇంటి వెలుపల సెక్యూరిటీ గార్డును నియమించుకోలేకపోవడంపై ప్రశ్నించారు. సెక్యూరిటీ ఎందుకు లేరని ప్రశ్నిస్తే వారి వద్ద సమాధానం లేదని అన్నారు. ఒక భవనంలో 30 సీసీటీవీ కెమెరాలు ఉన్నా కానీ, అవి దోపిడీని భౌతికంగా ఆపలేవని.. ఆ తర్వాత నేరాన్ని పరిష్కరించడంలో మాత్రమే సహాయపడతాయని ఆయన ఎత్తి చూపారు. రాత్రి సమయంలో వారికి డ్రైవర్ లేకపోవడాన్ని కూడా ఆయన ప్రస్థావించారు. ముంబైలోని చాలా ఇళ్లలో రాత్రిపూట సిబ్బందికి స్థలం లేదని ఆకాష్‌దీప్ భార్య షీబా చమత్కరించారు. అయితే బాలీవుడ్ అగ్ర హీరో, అగ్ర హీరోయిన్ ని 4 సినిమాల నటుడు విమర్శించడాన్ని నెటిజనులు తప్పు పడుతున్నారు. అతడు పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడని నెటిజనులు విమర్శించారు.
సైఫ్ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ నివాసిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి దాదాపు ముప్పై బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ కేసులో తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.