బాలయ్య తో తాండవం కృష్ణానదిలోనే ప్లాన్ చేస్తున్నారా?
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ తాడవం` శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jan 2025 5:30 PM GMTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ తాడవం` శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. `డాకు మహారాజ్` రిలీజ్ తో సంబంధం లేకుండా బాలయ్య తాండవాన్ని పట్టాలెక్కించి బిజీ అయ్యారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆర్ ఎఫ్ సీలో బాలయ్య సహా ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ వేశాలు చిత్రీకరించారు. అటుపై రెండవ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే పట్టా లెక్కించారు.
దీనిలో భాగంగా బాలయ్య పై కొన్ని సోలో సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా తదుపరి షెడ్యూల్ కి బోయపాటి రంగం సిద్దం చేస్తున్నారు. దీనిలో భాగంగా బోయపాటి అండ్ కో లోకేషన్ల వేటలో పడింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను కృష్ణాజిల్లా పరివాహాక ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించి అక్కడ లోకేషన్లను చూసారు. నందిగామ నియోజక వర్గం చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదీ ప్రాంతాన్ని పరిశీలించారు.
సెలయేరు..కొండగుట్టలతో నిండియన ఎంతో ఆహ్లాదాకరమైన వాతావరణం. ఆ ప్రాంతంలో సమీప విలేజ్ అన్ని ఎంతో సహజసిద్దంగా ఏర్పడ్డాయి. బోయపాటితో పాటు ఆర్ట్ విభాగానికి సంబంధించిన వారు ఉన్నారు. అంతా ఒకే అనుకుంటే గనుక తదుపరి షెడ్యూల్ ఇక్కడే మొదలవుతుందని తెలుస్తోంది. సరిగ్గా కృష్ణానది మధ్యలో బోయపాటి భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇలాంటి ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాల్ని తీర్చి దిద్దడంలో బోయపాటి స్పెషలిస్ట్. అలాంటి సన్నివేశాలతో అభిమానుల్లో ఊపు తేవడం అన్నది బోయపాటి ప్రత్యేకత. `జయజానకి నాయక`లోనూ హీరో సాయి శ్రీనివాస్ తో కృష్ణానదీ ప్రాంతంలోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించి సినిమాకి హైలైట్ గా చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది బాలయ్య తో యాక్షన సీన్ అంటే మామూలుగా ఉంటుందా.