అఖండ-2: నార్త్ లో బాలయ్య తాండవం..?
ఇది కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
By: Tupaki Desk | 21 Jan 2025 8:30 PM GMTటాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది మోస్ట్ సక్సెస్ ఫుల్ 'హీరో - డైరెక్టర్' కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.. బాలయ్యలోకి మాస్ ను సరికొత్తగా ఆవిష్కరించాయి. అందుకే ఈ కాంబోలో రాబోయే "అఖండ 2" సినిమాపై అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
2021లో రిలీజైన 'అఖండ' సినిమా ఎంతటి అఖండమైన విజయాన్ని సాధించిందో మనం చూశాం. దానికి సీక్వెల్ గా ఇప్పుడు ''అఖండ 2: తాండవం" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మికత అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. దేవుళ్ళు, దేవాలయాలు, సనాతన ధర్మం, శివ తత్త్వం ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. డివైన్ ఇంపార్టెన్స్ ని టైటిల్ లోగోతోనే మేకర్స్ తెలియజెప్పారు.
బోయపాటి శ్రీను ఈసారి యూనివర్సల్ అప్పీల్ ఉన్న పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో 'అఖండ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్యను ఒక అఘోరాగా, లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్ లో మొదటి భాగానికి మించి అత్యంత శక్తివంతంగా ప్రజెంట్ చేయబోతున్నారట. బోయపాటి యొక్క ట్రేడ్‌మార్క్ హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ డ్రామాతో ఈ చిత్రాన్ని తీర్చిద్దుతున్నారని అంటున్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మహా కుంభమేళాలో 'అఖండ 2' షూటింగ్ చేసిన విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తులు హాజరైన ఆధ్యాత్మిక వేడుకలో.. బోయపాటి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు సినిమాలో ఎమోషనల్ గా ఉంటాయని, మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో డివైన్ ఎలిమెంట్స్ తో తీసిన సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లో బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఇప్పుడు 'అఖండ 2: తాండవం' కథ, ఎమోషన్స్ నార్త్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం.. ఇంక థియేటర్లలో తాండవమే.
'అఖండ 2' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎన్ఐఏ ఆఫీసర్ గా నటించిన శరత్ లోహితాశ్వ సీక్వెల్ లోనూ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటి శోభన ఈ సినిమాలో అఘోరిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న శోభన.. స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ మూవీ చేయడానికి అంగీకరించిందట. పలువురు ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 2025 దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.