అఖండ-2.. అసలు నిర్మాత ఎవరబ్బా?
కొన్ని రోజుల క్రితం, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తమ బ్యానర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 7 Feb 2024 11:53 AM GMTకొవిడ్ టైంలో సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా భయపడింది. సినిమా రిలీజ్ చేస్తే అసలు థియేటర్లకు ప్రజలు వస్తారా రారా అనే ఆలోచనలో పడిపోయారు మేకర్స్. అలాంటి టైంలో నందమూరి బాలకృష్ణ.. అఖండ అంటూ థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
కొన్ని రోజుల క్రితం, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తమ బ్యానర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు అందరూ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా అల్లు అర్జున్ తో కాదు, నందమూరి బాలకృష్ణతో అఖండ పార్ట్ 2 అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
అయితే ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అల్లు అరవింద్, బాలకృష్ణ మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది. ఈ స్నేహ బంధంతోనే బోయపాటి, బాలకృష్ణ సినిమాను అల్లు అరవింద్ తమ నిర్మాణ సంస్థలో చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న మూవీ తర్వాత ఉండొచ్చని అని కూడా అంటున్నారు.
అయితే మరి ఈ సినిమాకు నిర్మాత ఎవరనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. వాస్తవానికి అఖండ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించాలనుకుంటే ఆయనే మళ్లీ నిర్మాతగా వ్యవహరించాలి. ఇంకా ఎవరైనా అఖండ-2 ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాల్సి వచ్చినా.. వారు రవీందర్ రెడ్డితోపాటు నిర్మాణ భాగస్వామి అవుతారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే వరకు అసలైన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాత్రమేనన్న మాట.
మరోవైపు, బాలయ్య అఖండ-2ను 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తుందని ఆ మధ్య మరికొన్ని వార్తలు వచ్చాయి. కానీ 14 రీల్స్ బ్యానర్, బోయపాటి శ్రీనివాస్.. బాలయ్యతో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేయాలాని నిర్ణయించుకున్నారట. అలా అఖండ-2 సినిమాపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎవరు నిర్మాతగా వ్యవహరిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.