Begin typing your search above and press return to search.

అఖిల్.. ఈసారి మట్టి వాసన వచ్చేలా..

ఈ నేపథ్యంలో అఖిల్ కొత్తగా చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీకి సిద్ధమవుతుండడం గమనార్హం. అతని గత సినిమాలు అర్థమవ్వని మార్కెటింగ్ కారణంగా నష్టపోయాయి.

By:  Tupaki Desk   |   12 March 2025 10:00 PM IST
అఖిల్.. ఈసారి మట్టి వాసన వచ్చేలా..
X

అఖిల్ అక్కినేని కెరీర్ ఇప్పటివరకు వన్ మ్యాన్ షో తరహాలో సాగింది. స్టైలిష్ యాక్షన్, లవర్ బాయ్ ఇమేజ్, మాస్ అప్పీల్ వంటి విభిన్న ప్రయోగాలు చేసినా, అతని కోసం అసలైన బ్రేక్ రావాల్సి ఉంది. ఒక పెద్ద విజయంతో మార్కెట్‌ను నిలబెట్టుకోవాలని చూస్తున్న అఖిల్, ఈసారి పూర్తిగా కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో చేసిన సినిమాలకు పూర్తి విరుద్ధంగా, అతనికి ఇప్పటివరకు అంచనా వేయని పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో కలిసి అఖిల్ ఒక ఇంటెన్స్ డ్రామా చేయబోతున్నాడని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కథానాయకుడిగా తాను ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్న అఖిల్, తన కెరీర్‌లో మొదటిసారి పూర్తి గ్రామీణ నేపథ్యంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆడియన్స్ ఈ తరహా సినిమాలను ఎంతగా స్వీకరిస్తారో అర్థం చేసుకున్న అతడు, ఈ కథపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఈ చిత్రం పూర్తిగా చిత్తూరు ప్రాంతంలోని కథతో తెరకెక్కనుంది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో చిత్తూరు యాసను ఉపయోగించిన సినిమాలు చాలా తక్కువ. సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో కథలు తీసే దర్శకులు, కడప, అనంతపురం వర్గాల్లో సీన్స్ డిజైన్ చేస్తుంటారు.

కానీ ఈ సినిమా కథ పూర్తి స్థాయిలో చిత్తూరు యాస, అక్కడి గ్రామీణ వాతావరణంతో తెరకెక్కబోతోందట. ఇది కథకు ఒక న్యూ కలర్ ను అందించడమే కాకుండా, అఖిల్ కెరీర్‌కు కొత్త కోణాన్ని ఇచ్చే అవకాశం ఉందని చిత్రబృందం భావిస్తోంది. అఖిల్ ఇప్పటివరకు మోడరన్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో అతను పూర్తిగా గ్రామీణ యువకుడిగా, మట్టి వాసన ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

ఈ తరహా పాత్రలు సరైన కథతో వస్తే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. పుష్ప తర్వాత గ్రామీణ నేపథ్య సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో అఖిల్ కొత్తగా చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీకి సిద్ధమవుతుండడం గమనార్హం. అతని గత సినిమాలు అర్థమవ్వని మార్కెటింగ్ కారణంగా నష్టపోయాయి. కానీ ఈసారి, కేవలం స్క్రీన్‌ప్లే, కథ, నటనపైనే ఫోకస్ పెట్టి, కమర్షియల్ హంగులు తగ్గించి సినిమా నిర్మాణం జరుగుతుందని సమాచారం.

ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ కలిపి ఒక పవర్‌ఫుల్ కథగా ఉండబోతోందని, ఇందులో కొత్త తరహా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ ఉంది. అఖిల్ కోసం UV క్రియేషన్స్ బ్యానర్‌లో మరో సినిమా కూడా లైనప్‌లో ఉంది. కానీ ప్రస్తుతానికి, ఈ గ్రామీణ కథపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అఖిల్ పక్కా కమర్షియల్ యాంగిల్ మినహా, కథపై ఆధారపడే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.