Begin typing your search above and press return to search.

అయ్యగారు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారే!

ఇకపోతే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో అఖిల్ ఓ సినిమా చేస్తారనే మాట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 July 2024 6:37 AM GMT
అయ్యగారు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారే!
X

యూత్ కింగ్ అఖిల్ అక్కినేనికి బ్లాక్ బస్టర్ సక్సెస్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, సినిమా కోసం ఎంతగా కష్టపడుతున్నా సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న 'ఏజెంట్' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినా అఖిల్.. సినిమా వచ్చి ఏడాది దాటినా ఇంతవరకూ తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అయితే ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో అఖిల్ అక్కినేని ఓ సినిమా చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా వెల్లడించలేదు కానీ, ఈ చిత్రంతో అనిల్‌ కుమార్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పీరియాడిక్ మూవీకి 'ధీర' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'Akhil 6' సినిమాని అఖిల్ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ, అలా జరగలేదు. అయితే దీంతో పాటుగా అక్కినేని వారసుడు మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్లుగా తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఖిల్ కెరీర్ మీద అక్కినేని నాగార్జున ఫోకస్ పెట్టడం లేదని ఫ్యాన్స్ సైడ్ నుంచి కామెంట్లు వస్తున్న నేపథ్యంలో.. తనయుడు కోసం మంచి స్క్రిప్ట్స్ సిద్ధం చేయడానికి కింగ్ రంగంలోకి దిగినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే మురళీ కిశోర్‌ అనే దర్శకుడు చెప్పిన కథను పక్కకు తీసిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంతకముందు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాని తెరకెక్కించిన మురళీ కిశోర్‌.. ఇప్పుడు అఖిల్ కోసం ఓ అద్భుతమైన స్టోరీని రాసుకున్నాడట. ఇప్పటికే నాగార్జునకు వినిపించగా, ఆయన్నుంచి సానుకూల స్పందన వచ్చిందట. ఇది అఖిల్‌కు సరిగ్గా సరిపోతుందని నాగ్ భావిస్తున్నారట.

'Akhil 7' చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగే రూరల్‌ డ్రామా అని టాక్. దీన్ని తమ సొంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. 'Akhil 6' సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత ఈ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో అఖిల్ ఓ సినిమా చేస్తారనే మాట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు జరిగాయని, ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కంఫర్మ్ అయిదని అంటున్నారు. ఇదే నిజమైతే 'ఏమాయ చేసావే' తో అక్కినేని నాగచైతన్యకు బ్లాక్ బస్టర్ అందించిన గౌతమ్ మీనన్.. ఈసారి అఖిల్ తో ఎలాంటి చిత్రాన్ని తీస్తారో వేచి చూడాలి.

మొత్తం మీద అఖిల్ తన కెరీర్ ను గాడిలో పెట్టుకోవడానికి గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ ను, వైవిద్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు. దీనికి తండ్రి నాగార్జున సైతం సపోర్ట్ గా నిలుస్తున్నట్లు అర్థమవుతోంది. అక్కినేని అందగాడికి అర్జంటుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్టు అవసమున్న తరుణంలో.. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ను అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.