అక్కినేని ఫ్యామిలీతో ప్రధాని మోదీ.. స్పెషల్ లాంచ్!
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని కార్యాలయాన్ని సందర్శించారు
By: Tupaki Desk | 7 Feb 2025 11:57 AM GMTతెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని కార్యాలయాన్ని సందర్శించారు. పార్లమెంట్ హాల్‌లోకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో నాగార్జునతో పాటు, ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్ల కూడా పాల్గొన్నారు. గతంలోనూ నాగార్జున ప్రధాని మోదీని పలుమార్లు కలిశారు. అయితే, ఈసారి కుటుంబ సమేతంగా ప్రధాని వద్దకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా సేవలో ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినిమాకు అందించిన సేవలను అభినందిస్తూ ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే అక్కినేని కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలని ప్రధాని నిర్ణయించారని సమాచారం. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు నాగార్జున ఆనందం వ్యక్తం చేసి, సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
తాజాగా ఈ భేటీలో కీలక అంశం అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచ్. ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన "అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ" అనే పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విడుదల చేయాలని నాగార్జున అభ్యర్థించారు. ఈ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించి, పార్లమెంట్ ప్రాంగణంలో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అక్కినేని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
ప్రధానిని కలిసే ముందు, నాగార్జున టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని సందర్శించినట్టు సమాచారం. ఇటీవల మోదీ, అక్కినేని నాగేశ్వరరావును గౌరవించడం, ఇప్పుడు నాగార్జున, చైతన్య, శోభిత ప్రధాని వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, నాగచైతన్య శోభిత జంటను కూడా ప్రధానికి నాగార్జున ప్రత్యేకంగా పరిచయం చేయడం ఆసక్తికర అంశంగా నిలిచింది. మోదీ వీరిని అభినందించారని సమాచారం.
ఇదిలా ఉండగా, నాగచైతన్య తాజా చిత్రం తండేల్ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదల రోజు ప్రధాని మోదీతో భేటీ కావడం ఈ సినిమాకు అదనపు హైప్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమా ప్రమోషన్‌కు సంబంధించి నాగచైతన్య ఇప్పటికే విస్తృత ప్రచారం జరిపారు. ఇప్పుడు, ప్రధాని భేటీ వల్ల మీడియా దృష్టి మరింతగా ఈ సినిమాపై పడింది. మొత్తానికి, అక్కినేని కుటుంబం ప్రధాని మోదీ భేటీ అనేక విశేషాలను సంతరించుకుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీగా కాకుండా, అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆవిష్కరణకు సంబంధించి ప్రధానమైన సమావేశంగా నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యామిలీకి, ముఖ్యంగా నాగచైతన్యకు, ఈ మీటింగ్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.