అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి..!
అక్కినేని హీరోలకు గడ్డు కాలం నడుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్స్‌తో సహవాసం చేస్తున్నారు.
By: Tupaki Desk | 8 Feb 2025 9:31 AM GMTఅక్కినేని హీరోలకు గడ్డు కాలం నడుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్స్‌తో సహవాసం చేస్తున్నారు. గత ఏడాది నా సామి రంగ సినిమాతో వచ్చిన నాగార్జున ఆకట్టుకోలేకపోయారు. అంతుకు ముందు ఏడాది 2023లో నాగార్జున నుంచి సినిమాలు రాలేదు. నాగ చైతన్య సైతం సక్సెస్ కొట్టి చాలా కాలం అయ్యింది. గత ఏడాది చైతన్య నుంచి సినిమాలే రాలేదు. ఇక అఖిల్ అక్కినేని సైతం సక్సెస్ కోసం కిందా మీదా పడుతున్నాడు. గత ఏడాది అఖిల్ నుంచి సినిమా రాలేదు. 2023లో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ సక్సెస్‌ను ఎంజాయ్ చేసి చాలా కాలం అయ్యింది.
నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా సినిమాలతో వస్తూ అప్పుడప్పుడు అయినా సక్సెస్‌లు దక్కించుకుంటూ ఉంటే, అక్కినేని హీరోల సినిమాలు రావడమే తక్కువ అయ్యాయి, అందులో ఎక్కువ శాతం ఫ్లాప్‌లు ఉంటున్నాయి. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఏయన్నార్ లెగస్సీని ప్రస్తుత హీరోలు మెయింటెన్ చేయలేక పోతున్నారు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు అక్కినేని ప్యాన్స్ ఊపిరి పీల్చుకునే విధంగా నాగ చైతన్య సక్సెస్ దక్కించుకున్నాడు. నిన్న విడుదలైన నాగ చైతన్య తండేల్ సినిమాకు మంచి టాక్ దక్కింది. అంతే కాకుండా మొదటి రోజు దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి.
నాగ చైతన్య కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్. అంతే కాకుండా అక్కినేని హీరోల సినిమాల్లోనూ ఇదే అత్యధిక ఓపెనింగ్ డే గా టాక్ వినిపిస్తుంది. అక్కినేని హీరోల టైం స్టార్ట్ అయ్యిందని, ఇక నుంచి వరుసగా పెద్ద సినిమాలు, వరుస హిట్స్ పడటం ఖాయం అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ తో టాలీవుడ్‌లో అక్కినేని హీరోల సక్సెస్ జర్నీ తిరిగి ప్రారంభం అయినట్లే అని, ఇదే ఏడాది అఖిల్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం ధనుష్ తో కలిసి 'కుబేరా' సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ నిస్పృహతో ఉన్న సమయంలో వచ్చిన తండేల్ సినిమా వారికి జోష్ నింపింది. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే విధంగా తండేల్ సినిమా టాక్ ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన తండేల్ సినిమాను అల్లు అరవింద్ సమర్పించారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రియల్ స్టోరీని ప్రేమ కథ నేపథ్యంలో చూపించి దర్శకుడు చందు మొండేటి సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియాలో తండేల్ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో అన్ని ఏరియాల్లోనూ రెండో రోజు వసూళ్లు ఎక్కువ అయ్యాయి. నేడు, రేపు శని, ఆదివారం కావడంతో అత్యధిక వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమాగా తండేల్ నిలవనుంది.