ఆ రెండు సినిమాల నుంచి తొలగించారన్న సూపర్‌స్టార్
ఈ మొత్తం ఎపిసోడ్ లో అవమానం ఎదుర్కొన్న సూపర్‌స్టార్ ఎవరు? అంటే.. అతడు మరెవరో కాదు..
By: Tupaki Desk | 23 Jan 2025 6:11 AM GMTఅభిమానులతో పాటు పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే బ్లాక్‌బస్టర్ ఫ్రాంఛైజీ నుంచి పెద్ద సూపర్‌స్టార్‌ని తొలగించి.. ఒక కుర్ర హీరోకి అవకాశం కల్పిస్తే, అది ఆ పెద్ద హీరోని ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించగలం. సూపర్ స్టార్‌కి అది ఎంతో అవమానకరమైనది. కానీ సూపర్‌స్టార్ ని తొలగించేందుకు నిర్మాణ సంస్థ వెనకాడలేదు. పైగా పరిశ్రమలో రైజింగ్ హీరోగా ఎదిగేస్తున్న ఒక యంగ్ స్టార్ ని అతడి స్థానంలో ఎంపిక చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సీక్వెళ్లలో యువహీరోకి అవకాశం కల్పించడమే గాక, బ్లాక్ బస్టర్లతో సత్తా చాటింది సదరు బ్యానర్.
ఈ మొత్తం ఎపిసోడ్ లో అవమానం ఎదుర్కొన్న సూపర్‌స్టార్ ఎవరు? అంటే.. అతడు మరెవరో కాదు.. ఖిలాడీ అక్షయ్ కుమార్. అతడి స్థానంలో భూల్ భులయా 2, భూల్ భులయా 3 సినిమాల్లో కార్తీక్ ఆర్యన్ ని రీప్లేస్ చేసారు. యంగ్ హీరో నటించిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడమే గాక, నిర్మాణ సంస్థకు బయ్యర్లకు భారీ లాభాల్ని అందించాయి. అదే సమయంలో సూపర్ స్టార్ అక్షయ్ స్థానాన్ని లాగేసుకుంటున్నాడంటూ కార్తీక్ ఆర్యన్ ని మీడియా ఆకాశానికెత్తేసింది. గోరు చుట్టుపై రోకటిపోటులా ఈ ప్రచారం సూపర్ స్టార్ అక్షయ్‌ని మరింత బాధపెట్టింది.
అయితే ఈ అవమానకర తొలగింపు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్కీని మీడియా ప్రశ్నించింది. ఇటీవల పింక్‌విల్లాతో జరిగిన సంభాషణలో ఒక అభిమాని అక్షయ్‌తో మాట్లాడుతూ .. మీరు నటించనందున భూల్ భూలైయా 2 , భూల్ భూలైయా 3 చూడలేదని చెప్పాడు. అక్షయ్ కుమార్ దానికి స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు. ``భేటా ముఝే నికాల్ దియా థా`` అని అన్నారు. దీని అర్థం `నన్ను తొలగించారు` అని అక్షయ్ ఇచ్చిన ఆన్సర్ చాలా సింపుల్ గా ఉంది. అయినా ఇప్పటికీ భూల్ భులయా నిర్మాణ సంస్థ టి.సిరీస్ తో అతడి సాన్నిహిత్యం చెక్కు చెదరలేదు.
ఒక సినిమా నుంచి పెద్ద స్టార్ ని తొలగించడం అంటే, ఆ సినిమా నిర్మాణ బడ్జెట్, పారితోషికాలు వగైరా చాలా కారణాలు ఉండొచ్చు. అదుపు తప్పుతున్న నిర్మాణ బడ్జెట్లు నిర్మాతలకు తల బొప్పి కట్టిస్తున్నాయి. టి.సిరీస్ అప్పట్లో అక్షయ్ ని తొలగించడానికి కారణం బడ్జెట్ భారం తగ్గించుకోవాలని ఆలోచించడమేనని కూడా కథనాలొచ్చాయి. అక్షయ్ కుమార్ తన పారితోషికాన్ని తగ్గించుకునేందుకు ఎంతమాత్రం సుముఖంగా లేకపోవడంతోనే అతడి స్థానంలో కార్తీక్ ఆర్యన్ ని బిబి 2, బిబి 3 కోసం తీసుకుని వచ్చారు. యువహీరోతో వరుసగా రెండు బంపర్ హిట్లు కొట్టారు.
భూల్ భూలయ్యా మొదటి భాగం 1993 మలయాళ చిత్రం `మణిచిత్రతాళు`కి అధికారిక రీమేక్. అక్షయ్ డాక్టర్ ఆదిత్య శ్రీవాస్తవ అనే మానసిక వైద్యుడి పాత్రను పోషించగా, విద్యాబాలన్ ఒక దెయ్యం(నర్తకి కూడా) తనను ఆవహించిందని నమ్మే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్న స్త్రీ పాత్రను పోషించింది. ఈ చిత్రం హర్రర్ కామెడీ జానర్ లో ట్రెండ్ సెట్టర్ అయింది. 2022లో విడుదలైన భూల్ భూలయ్యా 2లో అక్కీని... కార్తీక్ ఆర్యన్ రీప్లే చేసాడు. ఇందులో కియారా అద్వానీ , టబు నాయికలు. ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ విజయం తర్వాత కార్తీక్ ఆర్యన్ ని అక్షయ్ తో పోల్చారు అభిమానులు. అటుపైనా భూల్ భూలయ్యా 3లో విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నేనే , త్రిప్తి దిమ్రీలతో కలిసి మళ్లీ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో కనిపించాడు. విద్యా బాలన్ ఫ్రాంచైజీలోకి తిరిగి రావడం అభిమానులను ఉత్సాహపరిచింది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తారని ఆశించినా అది సాధ్యపడలేదు. తదుపరి అక్షయ్ హేరాఫేరి 3లో నటిస్తున్నారని సమాచారం.