క్రేజీ ఫ్రాంఛైజీ జెన్ Z కి అప్‌డేట్ కాలేకపోతే?
ఫ్రాంఛైజీ సినిమాలకు కొనసాగింపు భాగం తెరకెక్కించాలంటే, మునుపటి క్రేజ్ ఎప్పటికీ అలానే నిలిచి ఉండాలి.
By: Tupaki Desk | 22 Jan 2025 10:30 AM GMTఫ్రాంఛైజీ సినిమాలకు కొనసాగింపు భాగం తెరకెక్కించాలంటే, మునుపటి క్రేజ్ ఎప్పటికీ అలానే నిలిచి ఉండాలి. ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చాక కొత్త భాగం తెరకెక్కించే ప్రయత్నం చేస్తే అది కొంతవరకూ రిస్క్ తో కూడుకున్నది. ఫ్రాంఛైజీ క్రేజ్ ని బట్టి దానిని ముందుకు కొనసాగించాలి. లేదా ఫ్రాంఛైజీ ఉనికిని చాటుతూ నేటి జెన్ -జెడ్ స్టోరిని ఎంపిక చేసుకుని కొత్తదనం నిండిన పాత్రలతో దానిని తెరపైకి తేవాల్సి ఉంటుంది.
ఈ విషయంలో చాలా డైలమా కారణంగా అక్షయ్ కుమార్ `హేరా ఫేరి 3` చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతోందని భావిస్తున్నారు. అక్కీ నటించిన బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ కోసం పాతతరం అభిమానులు వేచి చూసినా కానీ నేటి యువతరం కూడా ఆదరిస్తేనే బ్లాక్ బస్టర్ కొట్టడం సాధ్యం. అలా జరగాలి అంటే కచ్ఛితంగా నేటితరానికి అప్ డేట్ చేస్తూ పాత్రలను రూపొందించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా దర్శకరచయితల పని.
కానీ హేరా ఫేరి 3 విషయంలో అలాంటి ప్రయత్నం జరగలేదని భావిస్తున్నారు. పార్ట్ 3 గురించి ప్రకటించి ఇప్పటికే చాలా కాలమే అయింది. టీజర్ ని లాంచ్ చేసారు. కానీ చిత్రీకరణ ముందుకు సాగలేదు. ఎప్పుడు విడుదలవుతుందో కూడా క్లారిటీ లేదు. దీంతో ఫ్రాంఛైజీని అభిమానించే ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ నెలకొంది. అదే సమయంలో ఖిలాడీ అక్షయ్ కుమార్ వయసు రీత్యా కూడా ఈ ఫ్రాంఛైజీని కొనసాగిస్తే మారిన అతడి బాడీ లాంగ్వేజ్ ని దర్శకరచయితలు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పాత మూసలో పాత చింతకాయ కథల్ని మళ్లీ చూపిస్తే కష్ఠం. నేటి ట్రెండ్ కి ఆపాదించి జెన్ జెడ్ ఆడియెన్ ని మెప్పించే పాత్రల చిత్రణ, గ్రిప్పింగ్ కథనం అవసరమని భావిస్తున్నారు. కామెడీ రొమాన్స్ యాక్షన్ మేళవించి తెరపై పాత్రల్ని పండించడంలో దర్శకుడు సఫలం కావాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
రాజు, శ్యామ్ , బాబు భయ్యా గురించి విని చాలా సంవత్సరాలు అయ్యింది .. కాబట్టి ఇవే పాత్రలను అప్ డేటెడ్ గా తీర్చిదిద్దాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్ , సునీల్ శెట్టి నటించిన టీజర్ ప్రోమో విడుదలైనా కానీ ఆశించినంత వేగంగా ఈ సినిమాని థియేటర్లలోకి తేలేని పరిస్థితి. 2000లలో ప్రారంభమైన ఫ్రాంఛైజీ గనుక దాదాపు 25 సంవత్సరాల తర్వాత కొత్త సినిమా రావాల్సి ఉంది. ప్రతి దశాబ్ధానికి ఒకసారి తరం మారిపోతూనే ఉంది. అందువల్ల హేరాఫేరి 3ని నేటితరానికి తగ్గట్టు తీర్చిదిద్దాల్సి ఉంది. అదే సమయంలో ఫ్రాంఛైజీ డైహార్డ్ ఫ్యాన్స్ ని నిరాశపరచకూడదు. హేరా ఫేరి 1కి ప్రియదర్శన్ దర్శకుడు కాగా, హేరాఫేరి 2 కి నీరజ్ వోరా దర్శకత్వం వహించారు. హేరాఫేరి 3కి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తారు. ఈ ఏడాదిలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని అక్షయ్ చెబుతున్నారు.