Begin typing your search above and press return to search.

చ‌రిత్ర పుస్త‌కాల‌ను స‌రిదిద్దాల‌న్న సూప‌ర్‌స్టార్‌

తాజా ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ పాఠశాల పాఠ్య పుస్తకాలలో ఆదర్శంగా ఉండాల్సిన సినిమాల్లో తాను న‌టిస్తానని అన్నాడు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 4:04 AM GMT
చ‌రిత్ర పుస్త‌కాల‌ను స‌రిదిద్దాల‌న్న సూప‌ర్‌స్టార్‌
X

జీవిత‌క‌థ‌ల్లో న‌టించేప్పుడు, లేదా జీవిత‌క‌థ‌ల‌పై శోధించేప్పుడు చ‌రిత్ర‌లోని చాలా నిజాలు నిగ్గు తేల్తాయి. చ‌రిత్ర‌ను చ‌దివి చ‌దివి బాగా అవ‌గాహ‌న వ‌చ్చాక‌, ఏ విభాగంలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారో కూడా కొంద‌రు నిపుణులుయ‌ విశ్లేషిస్తుంటారు. చ‌రిత్ర పాఠాలు చ‌ద‌వ‌డ‌మే కాదు, చారిత్ర‌క క‌థ‌ల్లో, జీవిత క‌థ‌ల్లో న‌టించిన అనుభ‌వం బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ కి ఉంది. అత‌డు తాజా ఇంట‌ర్వ్యూలో చ‌రిత్ర పాఠ్యాంశాలను మార్చాల్సిన అవ‌స‌రం గురించి ఓ సూచ‌న చేసారు. ఇది అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది.

మనం అక్బర్ లేదా ఔరంగజేబు గురించి చదువుతాము కానీ, మన దేశానికి చెందిన మ‌న‌వాళ్ల‌యిన‌ సొంత హీరోల గురించి కాదు! అని అత‌డు విమ‌ర్శించాడు. చరిత్ర పుస్తకాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా అక్షయ్ కుమార్ అంటున్నారు. గత కొన్నేళ్లుగా అక్షయ్ ప‌లు బయోపిక్‌లలో నటించాడు. 2018లో ప్యాడ్ మ్యాన్ చిత్రంలో లక్ష్మీ కాంత్ చౌహాన్ పాత్ర పోషించిన త‌ర్వాత గోల్డ్ (2018), కేసరి (2019), సామ్రాట్ పృథ్వీరాజ్ (2022), మిషన్ రాణిగంజ్ (2023), సర్ఫిరా (2024) వంటి బయోపిక్‌లలో నటించాడు. ఇప్పుడు జనవరి 24న విడుదలైన‌ స్కై ఫోర్స్ నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందింది. 1965లో జరిగిన ఇండో పాకిస్తాన్ వైమానిక యుద్ధంలో పాకిస్తాన్‌లోని సర్గోధ వైమానిక స్థావరంపై భారతదేశం జరిపిన ప్రతీకార దాడి కథను స్కై ఫోర్స్ లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ వింగ్ కమాండర్ కె.ఓ. అజుహా (నిజ జీవిత హీరో ఓ.పి. తనేజా ప్రేరణతో) పాత్రలో, డెబ్యూ నటుడు వీర్ పహరియా టి. విజయ (అజ్జమడ బొప్పయ్య దేవయ్య ప్రేరణతో) పాత్రలో నటించారు.

బ‌యోపిక్ లు అన్నీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌వు. అక్ష‌య్ న‌టించిన‌ బయోపిక్‌లలో కొన్ని వ‌ర్క‌వుటైనా కానీ మ‌రికొన్ని భారీ పరాజయాలను చవిచూశాయి. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అతడు అలాంటి పాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాను బ‌యోపిక్ ల‌నే చేయాలని ఎందుకు భావిస్తున్నాడో కూడా అక్షయ్ వెల్ల‌డించారు.

తాజా ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ పాఠశాల పాఠ్య పుస్తకాలలో ఆదర్శంగా ఉండాల్సిన సినిమాల్లో తాను న‌టిస్తానని అన్నాడు. పుస్తకాలలో లేనివి మ‌న‌కు తెలియ‌నివి చాలా ఉన్నాయి. నేను ఉద్దేశపూర్వకంగా మన పాఠ్య‌ పుస్తకాలలో క‌నిపించ‌ని పాత్రలను పోషిస్తున్నాను. మ‌న చ‌రిత్ర‌కారులు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని నిజ‌మైన హీరోలు. ఎవరూ ఇలాంటి వాటి గురించి లోతుగా వెళ్లరు కాబట్టి ప్రజలకు ఏమీ తెలియదు. నేను ఈ రకమైన పాత్రల కోసం ఎంత దూర‌మైనా వెళ‌తాను.. అని అక్ష‌య్ కుమార్ అన్నారు.

స్కూల్ పిల్లలు చ‌దువుకునే చరిత్ర పుస్తకాల నుంచి చాలా విషయాలను సరిదిద్దాలి! అని అక్ష‌య్ సూచించారు. మనం అక్బర్ లేదా ఔరంగజేబు గురించి చదువుతాం కానీ మన సొంత హీరోల గురించి చదవము. అలాంటి నిజ క‌థ‌ల‌ను పాఠ్య పుస్త‌కాల‌లో ఉంచాలి. సైన్యంలోని వీరుల‌కు సంబంధించిన చాలా కథలు ఉన్నాయి. చాలా మందికి పరమ వీర్ చక్ర పురస్కారం లభించింది. పుస్త‌కాల‌లోని చరిత్రను సరిదిద్దాలి. ఈ రకమైన నాయకులను మన తరానికి తీసుకురావాలి అని ఆయన అన్నారు.