క్రేజీ ఫ్రాంఛైజీ: ఇల్లు అలకగానే సంబరం కాదు!
''ఇల్లు అలకగానే సంబరం కాదు! చేయాల్సింది చాలా ఉంది''. భారీ కాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో సినిమా తీసేస్తున్నాం! అని ప్రకటనలు గుప్పిస్తూ హడావుడి చేస్తే సరిపోదు.
By: Tupaki Desk | 13 Sep 2024 11:30 AM GMT''ఇల్లు అలకగానే సంబరం కాదు! చేయాల్సింది చాలా ఉంది''. భారీ కాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో సినిమా తీసేస్తున్నాం! అని ప్రకటనలు గుప్పిస్తూ హడావుడి చేస్తే సరిపోదు. దీనికి మంచి కథ, కథనం, గ్రిప్పింగ్ నేరేషన్, సరైన విజువల్ ట్రీట్ అవసరం. ఇవన్నీ హౌస్ ఫుల్ 5లో ఉన్నాయా లేదా? ఈ సీజన్ లో అత్యంత భారీ తారాగణం, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అసలు మ్యాటర్ ఎంత? మేకింగ్ ఎలా ఉండనుంది? అన్నది చర్చగా మారింది.
ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన హౌస్‌ఫుల్ 5 ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ హైప్ తో ఉంది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. అయితే ఈ సినిమా స్టార్ కాస్టింగ్ అంతకంతకు పెరుగుతూ ఉంది. అక్షయ్ తో పాటు ఈ చిత్రంలో రితీష్ దేశ్‌ముఖ్, నానా పటేకర్, చుంకీ పాండే, డెనో మోరియా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ , సోనమ్ బజ్వా వంటి తారలు నటిస్తున్నారని ఇప్పటికే పరిచయం చేసారు. వీరితో పాటు మరింత మంది పెద్ద తారలను ఒప్పిస్తారని కూడా గుసగుస వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా చిత్రీకరణ సాగుతుండగానే, ఇలా ఒక్కొక్కరుగా స్టార్ కాస్టింగ్ ని పెంచుకుంటూ వెళ్లడం వెనక వ్యూహం ఏమై ఉంటుంది? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అక్షయ్ సంతృప్తిగా లేకపోవడంతోనే ఇతర పెద్ద తారలను నడియాడ్ వాలా బ్యానర్ పెంచుతోందని కూడా గుసగుస వినిపిస్తోంది. అక్షయ్ కి ఇటీవల సరైన సోలో సక్సెస్ లేదు. స్త్రీ2 లో అతిథి పాత్ర మినహా స్ట్రెయిట్ భారీ చిత్రాల్లో నటించినా అవేవీ అక్కీకి సక్సెస్ ని ఇవ్వలేదు. అందువల్లనే అక్కీతో పాటు పెద్ద స్టార్లను దించుతోంది సదరు బ్యానర్ అన్న సందేహాలున్నాయి.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన మరొక విషయం ఉంది. భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తే సరిపోతుందా? వారికి సరిపడినంత స్క్రీన్ టైమ్ కూడా అవసరమే కదా? అది ఎలా సెట్ అవుతుంది? దర్శకుడు అంత ప్రతిభావంతంగా వారిని హ్యాండిల్ చేయగలుగుతున్నారా? అన్నది చర్చగా మారింది. అయితే అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం హిట్టు కొట్టడం మాత్రమే. అది తరుణ్ మున్సుఖాని బృందం చేయగలుగుతుందా? అన్నది వేచి చూడాలి.