నన్ను అడగడం మానేసి వారిని అడగండి..!
స్కై ఫోర్స్ సినిమా తన మనసుకు నచ్చిన సినిమా అని, చాలా విషయాలు మన దేశ గొప్పతనం చాటే విధంగా ఉంటాయని అన్నారు.
By: Tupaki Desk | 7 March 2025 10:30 AMబాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవల స్కై ఫోర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన వైమానిక యుద్దం నేపథ్యంలో జరిగే కథ ఆధారంగా సినిమాను రూపొందించారు. ఆ యుద్ధ సమయంలో కనిపించకుండా పోయిన ఒక ఎయిర్ ఫోర్స్ సభ్యుడి చుట్టూ కథ సాగుతుంది. దేశ భక్తి చిత్రాలకు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ సినిమాకు సైతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్ కుమార్ మరోసారి తన నటనతో మెప్పించారు. ఆ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
స్కై ఫోర్స్ సినిమా తన మనసుకు నచ్చిన సినిమా అని, చాలా విషయాలు మన దేశ గొప్పతనం చాటే విధంగా ఉంటాయని అన్నారు. దేశంలోని ప్రజల కోసం ఎయిర్ ఫోర్స్ ఎంతగా కష్టపడుతుందో చూపించే ప్రయత్నాలు చేశామని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం హిందీలో మాత్రమే కాకుండా ఇలాంటి సినిమాలు అన్ని భాషల్లో రావడం మంచిదనే అభిప్రాయంను సైతం పలువురు వ్యక్తం చేశారు. తాజాగా సినిమా గురించిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన స్టార్డం గురించి, తన స్టార్ స్టేటస్ గురించి వ్యాఖ్యలు చేశారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... నాకు స్టార్‌లా ఉండటం నచ్చదు. స్టార్స్ రాత్రి సమయంలో వచ్చి ఉదయాన్నే కనిపించకుండా పోతాయి. అలా రాత్రి వచ్చి పొద్దున్నే వెళ్లి పోయేవి నాకు నచ్చవు. అందుకే నేను సూర్యుడిలా ఉండాలి అనుకుంటాను. సూర్యడిలా అయితే ఉదయాన్నే వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడి మాదిరిగా నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఎప్పుడూ కనీసం ఆలస్యం చేయకుండా ఉదయం సమయంలో నిద్ర లేవడం తనకు అలవాటు అన్నాడు. అందుకే ఉదయం నిద్ర లేచే సూర్యుడు అంటే తనకు అభిమానం అంటూ అక్షయ్ కుమార్ చెప్పాడు. క్రమశిక్షణ అనేది సూర్యుడిని చూసి నేర్చుకోవచ్చు అన్నాడు.
ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం చేయడం వల్లే ఎంతో మంది క్రీడాకారులు నేడు మన దేశానికి పతకాలు తెచ్చి పెట్టారు. వారు ఉదయాన్నే లేవకుంటే అది అంతా సాధ్యం అయ్యేదా మీరు అడిగి తెలుసుకోండి అన్నాడు. కొందరు నన్ను ఎందుకు మీరు అంత త్వరగా లేస్తారు, అంత త్వరగా సెట్స్ కి వస్తారు అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న అడిగిన సమయంలో నాకు చాలా కోపం వస్తుంది. ఆ ప్రశ్న నన్ను అడగడం మానేసి ఆలస్యంగా నిద్ర లేచి, సెట్స్‌కి ఆలస్యంగా వచ్చే వారిని అడగవచ్చు కదా అంటూ అక్షయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశాడు. ఉదయం నిద్ర లేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అక్షయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.