12 ఫ్లాపులొచ్చినా ఆ డైరెక్టర్‌తో ప్రయోగం?
ఫ్లాప్ చిత్రాలతో నిరాశపరిచిన వెంకట్ ప్రభును నమ్మి ఇప్పుడు అక్షయ్ ముందుకు వెళుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 15 March 2025 7:00 AM ISTఇటీవలి కాలంలో బాలీవుడ్ సూపర్ స్టార్లు సౌత్ డైరెక్టర్లను నమ్మినంతగా, ఫార్ములాటిక్ పూణే ఫిలింఇనిస్టిట్యూట్ డైరెక్టర్లను నమ్ముతున్నట్టు లేదు. అందుకే ప్రయోగాత్మక కథలతో తమను కలిసే ఉత్తరాది దర్శకుల కంటే కమర్షియల్ స్క్రిప్టులతో తమ వద్దకు వచ్చే సౌత్ దర్శకులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫ్లాపుల్లో ఉన్న సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కి అవకాశం కల్పించారు. ఈ కలయికలో సికందర్ ఈద్ కానుకగా విడుదలకు వస్తోంది. ఇంతలోనే ఖిలాడీ అక్షయ్ కుమార్ సౌత్ నుంచి వెంకట్ ప్రభును ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచింది. వెంకట్ ప్రభు గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి. కస్టడీ, ది గోట్ (దళపతి విజయ్ హీరో) లాంటి ఫ్లాప్ చిత్రాలతో నిరాశపరిచిన వెంకట్ ప్రభును నమ్మి ఇప్పుడు అక్షయ్ ముందుకు వెళుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కెరీర్ లో దాదాపు 12 ఫ్లాపులిచ్చిన అక్షయ్ కుమార్ తో ఫ్లాప్ దర్శకుడి ప్రయాణంపై చాలా సందేహాలు నెలకొన్నాయి. ఈ జోడీ సరైనదేనా? బ్లాక్ బస్టర్ దర్శకులతో టచ్ లోకి రాకుండా అక్షయ్ ఎంపికలు నాశిరకంగా ఉన్నాయని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. పైగా వెంకట్ ప్రభుతో పాన్ ఇండియా సినిమా కోసం ప్లాన్ చేసాడనేది నిరుత్సాహపరుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉందని చెబుతున్నారు. దీనిని మంచి స్క్రిప్టు డిసైడ్ చేస్తుంది. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.