Begin typing your search above and press return to search.

రీమేక్ తో హీరో పెద్ద త‌ప్పే చేస్తున్నాడా?

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Feb 2024 3:00 AM GMT
రీమేక్ తో హీరో పెద్ద త‌ప్పే చేస్తున్నాడా?
X

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌యాలు లేక‌పోయినా..వాటితో ప‌నిలేక‌పోయినా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అక్ష‌య్ కుమార్ తో ఎగ‌బ‌డి మ‌రీ సినిమాలు చేస్తున్నార‌ని ఆయ‌న ట్రాక్ చూస్తే తెలుస్తుంది. రెండున్న‌రేళ్ల క్రితం సూర్యవంశీ..ఆత్రాంగిరేతో విజ‌యాలు అందుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా తొమ్మిది సినిమాలు రిలీజ్ చేసాడు. వాటిలో ఒక‌టి కూడా హిట్ అవ్వ‌లేదు. అయినా స‌రే ఖిలాడీకి ఛాన్సులు మాత్రం త‌గ్గలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న ఖాతాలో ఓ ప‌దిసినిమాలు ఉన్నాయి.


దీంతో 2024 డైరీ కూడా ఫుల్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ లో ఉండ‌గా మ‌రికొన్ని క‌మిట్ అయిన చిత్రాలు. ఏది ఏమైనా ఇచ్చిన మాట ప్ర‌కారం అవ‌న్నీ ఇదే ఏడాది రిలీజ్ చేసేస్తారు. ఆయ‌న సినిమ‌లు చేయ‌డం చూస్తుంటే పారితోషికం కోసం చేస్తున్నారా? లేక విజ‌యం కోసం మార్కెట్ రెట్టింపు అవ్వ‌డం కోసం చేస్తున్నాడా? అన్నది అర్దం కాని స‌న్నివేశంగా క‌నిపిస్తుంది. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో ఖిలాడీపై వ‌చ్చిన నెగిటివిటీపై ఆ మ‌ధ్య కాస్త ఎమోష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ తో ప‌నిలేకుండా సినిమాలు చేస్తున్నారు? ఆ స‌క్సెస్ ఎప్పుడు వ‌స్తుంద‌ని నెటి జ‌నులు ప్ర‌శ్నించేస‌రికి అక్ష‌య్ కాస్త నిరుత్సాహ ప‌డ్డాడు.

తాజాగా మ‌రోసారి రీమేక్ చేస్తోన్న ఓ సినిమాపై అలాంటి విమ‌ర్శలే తెర‌పైకి వ‌స్తున్నాయి. సూర్య హీరోగా న‌టించిన 'స‌రూరై పొట్రూ'( ఆకాశ‌మే నీహ‌ద్దురా) ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సామాన్యుడిని ప్లైట్ ఎక్కించాల‌ని హీరో ఎయిర్ పోర్స్ ఉద్యోగం వ‌దిలేసి చేసిన ఓ వాస్త‌వ క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రమిది. జాతీయ అవార్డును కూడా తెచ్చి పెట్టింది. సుధ కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్పుడీ చిత్రాన్ని అక్ష‌య్ కుమార్ హిందీలో 'సర్పిరా' టైటిల్ తో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని జులైలో రిలీజ్ కానుంది.

రీమేక్ బాద్య‌త‌లు కూడా సుధ కొంగ‌ర చూస్తున్నారు. అయితే ఓటీటీలో హిట్ అయిన సినిమాని అక్ష‌య్ రీమేక్ చేయ‌డంపై తాజాగా విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఓటీటీలో అన్ని భాష‌ల్లో అందుబాటులో ఉన్న సినిమాని అక్ష‌య్ రీమేక్ చేయ‌డం అన్న‌ది త‌ప్పుడు నిర్ణ‌యంగా విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఈ క‌థ ద్వారా కొత్త‌గా అక్ష‌య్ ఏం చెప్ప‌బోతున్నాడు? పాత ఎమోష‌న్ కి కొత్త మ‌సాలా ఎలా దట్టించ‌బోతున్నార‌ని? అని నెటి జ‌నులు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి వీటికి 'స‌ర్పిరా' ఎలాంటి చెక్ పెడుతుంద‌న్న‌ది చూడాలి.