బిగ్ హీరో కాస్త గ్యాప్ ఇస్తే బెటర్!
పర్వాలేదనే టాక్ వచ్చిన కూడా అక్షయ్ కుమార్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎందుకనో అంతగా మొగ్గు చూపించడం లేదు.
By: Tupaki Desk | 28 July 2024 4:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గత కొన్నేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోవడం లేదు. అతను హీరోగా వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేసిన కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అవుతున్నాయి. కనీసం బ్రేక్ ఈవెన్ దగ్గరకి కూడా కలెక్షన్స్ రావడం లేదు. వీకెండ్ మూడు రోజుల్లోనే సినిమా తేలిపోతుంది. పర్వాలేదనే టాక్ వచ్చిన కూడా అక్షయ్ కుమార్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎందుకనో అంతగా మొగ్గు చూపించడం లేదు.
2020 నుంచి ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ నుంచి 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో ఓ రెండు సినిమాలు మాత్రమే కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. మిగిలినవన్నీ డిజాస్టర్ గానే మారాయి. ఎలాంటి కథతో వస్తున్న కూడా అక్షయ్ కుమార్ ని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. అందుకే తాజాగా రిలీజ్ అయిన సర్ఫిరా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా డిజాస్టర్ గా మారింది. బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి ఈ మూవీ కలెక్షన్స్ రాలేదు.
నిజానికి సర్ఫిరా మూవీ తమిళ్ హిట్ మూవీ సూరరై పోట్రుకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి గాను సూర్య నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఓటీటీలో అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అలాంటి హిట్ మూవీ రీమేక్ అంటే కచ్చితంగా ఎంతో కొంత పాజిటివిటీ, హైప్ ఉంటుంది. కానీ సర్ఫిరా మూవీ ఎలాంటి హైప్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మూవీ టార్గెట్ ఎక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.
ప్రేక్షకులు కూడా వీక్ డేస్ లో ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇలాంటి పరిస్థితిలో అక్షయ్ కుమార్ సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. ఒక్కసారి గ్యాప్ తీసుకొని కథల ఎంపికలో ఎక్కడ తప్పు జరుగుతుందో సరిచేసుకొని మరల బలమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేయాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా అలాగే గ్యాప్ తీసుకొని గత ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఒక్కో సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడని చెబుతున్నారు.
అయితే అక్షయ్ కుమార్ బ్రేక్ తీసుకోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అక్షయ్ కుమార్ నుంచి ఈ ఏడాది 2 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. 2025లో మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అలాగే రెండు సినిమాలలో క్యామియో రోల్స్ చేస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని సినిమా కథలు డిస్కషన్ దశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.