స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాడు!
ముఖ్యంగా ఈ కుటుంబ హీరోల సింప్లిసిటీ స్వభావంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది.
By: Tupaki Desk | 22 May 2024 2:45 AM GMTమెగా కుటుంబంలో యువహీరోలు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిలోని క్రమశిక్షణ, నిబద్ధత, హార్డ్ వర్క్ వారిలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కుటుంబ హీరోల సింప్లిసిటీ స్వభావంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఇది చిరు వారికి నేర్పిన ఆదర్శవంతమైన గుణం. బాలీవుడ్ లో అలాంటి ఒక హీరో ఖిలాడీ అక్షయ్ కుమార్. అతడు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ అంతగా ఒదిగి ఉంటాడు. ప్రతి ఒక్కరినీ గౌరవించే విధానం, రిసీవ్ చేసుకునే తత్వం, సింప్లిసిటీ అతడిని అందరివాడిని చేసింది. ఇప్పుడు అతడి వారసుడు కూడా తననే అనుసరిస్తున్నాడు. సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ అనేది వారి తత్వం.
'ధావన్ కరేంగే' పేరుతో కొత్త సెలబ్రిటీ షోకి క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్ట్‌గా మారాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టాక్ షోకి హాజరైన మొదటి సెలబ్రిటీ. ఈ షోలో అక్షయ్ తన కుమారుడు ఆరవ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కొడుకు నటనపై ఆసక్తి చూపడం లేదని అక్షయ్ వెల్లడించాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ-''నేను, ట్వింకిల్ ఆరవ్‌ని పెంచిన విధానం నాకు సంతోషంగా ఉంది. అతడు చాలా సాధారణ అబ్బాయి.. మేము అతడిని ఏదో చేయమని ఎప్పుడూ బలవంతం చేయలేదు. తనకు సినిమాల్లో భాగం కావాలని లేదు. అతడి ఆసక్తి ఫ్యాషన్‌పై ఉంది'' అని అన్నారు. తన వృత్తిపరమైన కెరీర్‌కు సంబంధించి ఆరవ్ నిర్ణయాన్ని అక్షయ్ కుమార్ స్వాగతించారు. ఆరవ్ ఇప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారారని అన్నారు.
ఆరవ్ 15 సంవత్సరాల వయస్సులో లండన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. అతడు వెళ్లాలని నేను కోరుకోలేదు. కానీ నేను అతడిని ఆపలేదు ఎందుకంటే నేను కూడా 14 సంవత్సరాల వయస్సులో ఇంటి నుండి వెళ్లాను. అతడు ఇంటి పనులన్నీ స్వయంగా చేస్తాడు. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతడు ఖరీదైన బట్టలు కొనడు.. సెకండ్ హ్యాండ్ బట్టలు విక్రయించే థ్రిఫ్టీ అనే దుకాణానికి వెళ్తాడు. డబ్బును వృధా చేయడం తనకు ఇష్టం లేదని కూడా అక్షయ్ చెప్పారు. అక్షయ్ ఒక ఆర్మీ అధికారి కుమారుడు. క్రమశిక్షణతో పెరిగాడు. డబ్బు విలువ తెలిసినవాడు. పైగా మధ్యతరగతి నుంచి ఎదిగిన వాడిగా విలువలకు కట్టుబడి ఉంటాడు.