Begin typing your search above and press return to search.

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అల వైకుంఠపురం సీన్ రిపీట్‌..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ కోసం ఇద్దరు గర్భిణులు ఒకే సమయంలో రావడం జరిగింది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 3:45 AM GMT
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అల వైకుంఠపురం సీన్ రిపీట్‌..!
X

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువులు తారుమారు కావడం, మిస్ కావడం జరిగిందని మనం వార్తల్లో వింటూ ఉంటాం. తాజాగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అల వైకుంఠపురంలో సీన్‌ రిపీట్‌ అయింది. అయితే కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో వెంటనే సిబ్బంది తమ తప్పును తెలుసుకున్నారు. ఒకరి బిడ్డను మరొకరికి ఇవ్వడం ద్వారా కొంత సేపు గందరగోళం క్రియేట్‌ చేసిన ఆసుపత్రి వర్గాలపై, సిబ్బందిపై సాధారణ జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ కోసం ఇద్దరు గర్భిణులు ఒకే సమయంలో రావడం జరిగింది. ఇద్దరికీ ఒకేసారి పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఇద్దరినీ ఒకేసారి ఆపరేషన్ థియేటర్‌ కి తీసుకు వెళ్లి డెలివరీ చేయడం జరిగింది. ఇద్దరు గర్భిణీలు మగ శిశువులకు జన్మనివ్వడం తో పాటు దాదాపు ఒకే సమయంలో డెలివరీ అయ్యారు. దాంతో సిబ్బంది ఆపరేషన్‌ థియేటర్‌ బయట ఉన్న వారి వారి బంధువులకు ఎవరి బిడ్డను వారికి కాకుండా మార్చి ఇవ్వడంతో వివాదం తలెత్తింది. అల వైకుంఠపురం లో మురళీ శర్మ కావాలని పిల్లలను తారుమారు చేస్తే ఇక్కడ మాత్రం సిబ్బంది తప్పిదం వల్ల బిడ్డలు తారు మారు అయ్యారు.

సాధారణంగా డెలివరీ సమయంలో ఎవరి దుస్తులు వారు తీసుకు వెళ్తూ ఉంటారు. అయితే బిడ్డను తీసుకు వచ్చిన దుస్తులు తమకు చెందినవి కాకపోవడంతో మొదట ఒక శిశువుకు చెందిన కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఆ తర్వాత మరో శిశువు కుటుంబ సభ్యులు సైతం అనుమానం వ్యక్తం చేయడం జరిగిందట. బేబీకి ఉన్న డ్రెస్‌, టవల్‌ ఇతర ఆనవాల్లు గుర్తించిన కుటుంబ సభ్యులు మా బేబీ కాదంటే మా బేబీ కాదని చెప్పడంతో డాక్టర్లు బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది.

సిబ్బంది తప్పుగా ఒకరి బిడ్డను మరొకరికి ఇవ్వడం జరిగిందని గుర్తించారు. పుట్టిన బిడ్డలకు వెంటనే స్టిక్కర్స్ వేయడం జరిగింది. ఆ స్టిక్కర్స్ ఆధారంగా తల్లులను గుర్తించి, ఎవరి బిడ్డను వారికి ఇచ్చినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. రెండు డెలివరీ దాదాపు ఒకే సమయంలో జరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, సిబ్బంది ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందని ఆసుపత్రి వర్గాల వారు పేర్కొన్నారు. గందరగోళానికి కారణం అయిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.