Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో మరో యాక్టర్ కొడుకు.. ఏపీ నుంచే?

ఈ కోవలోనే తాజా కేసులో కోలీవుడ్ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ అరెస్టు కావడం కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   4 Dec 2024 9:22 AM GMT
డ్రగ్స్ కేసులో మరో యాక్టర్ కొడుకు.. ఏపీ నుంచే?
X

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. గతకొంతకాలంగా డ్రగ్స్ కేసులు వరుసగా బయటపడుతుండటం, ప్రముఖుల పేర్లు వినిపించడంతో విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కోవలోనే తాజా కేసులో కోలీవుడ్ ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ అరెస్టు కావడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ విక్రయం, వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలతో అతనిపై కేసు నమోదైంది.

తాజా కేసులో పోలీసులు చేసిన దర్యాప్తు ప్రకారం, అలీఖాన్ తుగ్లక్ తన స్నేహితులతో కలిసి గంజాయి, మెథాంఫెటమిన్ వంటి మాదక ద్రవ్యాలను విక్రయించడమే కాకుండా వాటిని వినియోగించినట్లు నిర్ధారించారు. గత నెలలోనే చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని సమాచారం అందుకున్న పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, అలీఖాన్ తుగ్లక్ పేరు బయటపడింది.

విచారణలో వెల్లడైన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, చెన్నైలో అమ్మకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అదనంగా, మెథాంఫెటమిన్ వంటి హైగ్రేడ్ డ్రగ్స్ కూడా వీరు విక్రయించినట్లు తెలియజేశారు. అందులోనూ విద్యార్థుల ఫోన్లను తనిఖీ చేయగా, అలీఖాన్ తుగ్లక్ నేరాలకు సంబంధించి అనేక కీలక ఆధారాలు లభించాయి. దాంతో పోలీసులు అతనితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.

మన్సూర్ అలీఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు డ్రగ్స్ విక్రయం కేసులో ఇరుక్కోవడం, అది కూడా సినిమారంగానికి చెందిన వ్యక్తిగా ఉంటూ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం అలీఖాన్ తుగ్లక్‌ను పోలీసులు 12 గంటలపాటు విచారించి, కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అరెస్టైన పదిమంది విద్యార్థుల జాబితాలో అలీఖాన్ తుగ్లక్ కీలక వ్యక్తిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ విక్రయంతో పాటు తానే స్వయంగా వినియోగించినట్లు వైద్య పరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం వీరందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటన ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకుముందు డ్రగ్స్ వినియోగం కేసుల్లో పలువురు ప్రముఖులు చిక్కుకున్నా, ఇంత పెద్ద మాదక ద్రవ్య విక్రయం వ్యవహారంలో ఒక సినీ ప్రముఖ కుటుంబం సభ్యుడి పేరు రావడం నూతన అనుమానాలకు తావిస్తోంది. సినిమా రంగానికి సంబంధించినవారిలో డ్రగ్స్ కల్లోలానికి సంబంధించిన చర్యలు మరింత కఠినతరం చేయాలన్న దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.