కేన్స్ 2025 ఉత్సవంలో RRR స్టార్ బోల్డ్ ట్రీట్
నేడు బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిస్సింగ్ నటీమణుల జాబితాలో ఆలియా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీపిక, కత్రిన తర్వాత ఆ రేంజులో పారితోషికం అందుకునే నటిగాను ఆలియా పేరు మార్మోగుతోంది.
By: Tupaki Desk | 14 March 2025 12:52 PM ISTRRR చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఆలియా భట్. ట్యాలెంటెడ్ ఆలియా అప్పటికే రాజీ, హైవే, గల్లీబోయ్, ఉడ్తా పంజాబ్ సహా పలు బ్లాక్ బస్టర్లలో నటించి విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో సీతగా హృదయాలను గెలుచుకున్న ఆలియాకు దక్షిణాదినా అభిమానులేర్పడ్డారు. ఫాంటసీ డ్రామా 'బ్రహ్మాస్త్ర'తో మరోసారి సౌత్ ఫ్యాన్స్ కి చేరువైంది. ఆ తర్వాత ఆలియా నటించిన `గంగూభాయి కథియావాడీ`ని ఓటీటీల్లో వీక్షించిన ఫ్యాన్స్ తన నటప్రతిభను హ్యాట్సాఫ్ చెప్పారు.
నేడు బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిస్సింగ్ నటీమణుల జాబితాలో ఆలియా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీపిక, కత్రిన తర్వాత ఆ రేంజులో పారితోషికం అందుకునే నటిగాను ఆలియా పేరు మార్మోగుతోంది. ఈ శనివారం నాటికి 32 ఏళ్లు నిండిన అలియా భట్ ఫ్రాన్స్‌లో జరిగే `కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025`కు తొలిసారిగా హాజరవుతున్నట్లు ప్రకటించింది.
ఈరోజు ఆలియా పుట్టినరోజు సందర్భంగా కేన్స్‌లో అడుగుపెడుతుండడం తనను ఎగ్జయిట్ చేస్తోందని, అక్కడ పూర్తిగా మేకప్, కాస్ట్యూమ్స్ పరంగా భిన్నమైన ప్రయోగాలు చేయబోతున్నానని వెల్లడించింది. ఏడాది ఆరంభమే మేకప్ సహా పలు విషయాల్లో బోల్డ్ గా ప్రయోగాలు చేస్తున్నానని కూడా తెలిపింది.
గతంలో కేన్స్ లో ప్రఖ్యాత సౌందర్య ఉత్పత్తుల కంపెనీ లోరియల్ పారిస్‌కు ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపిక లాంటి స్టార్లు ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఆ అవకాశం ఆలియాకు లభించింది. ఈసారి కూడా రెగ్యులర్ గా కేన్స్ లో పాల్గొనే ఐశ్వర్యారాయ్ తో పాటు ర్యాంప్ వాక్ చేసే అరుదైన అవకాశం ఆలియాను వరించింది. 78 వ ఏట అడుగుపెట్టిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 నుండి మే 24 వరకు జరుగుతుంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫ్రెంచ్ నటి జూలియట్ బినోచే సారథ్యంలో కేన్స్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం కేన్స్ జ్యూరీకి నాయకత్వం వహించిన గ్రెటా గెర్విగ్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆలియా తదుపరి రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రణబీర్ బ్రహ్మాస్త్ర 2 ని కూడా ప్రకటించాడు.