నెలకు 9లక్షల అద్దె వసూల్ చేస్తున్న నటి
అలాగే చాలా మంది నటీమణులు తమ ఫ్లాట్ లను రీసేల్ చేయడం లేదా అద్దెల రూపంలో భారీగా డబ్బును వెనకేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2025 5:05 PM GMTబాలీవుడ్ స్టార్లు తెలివైన పెట్టుబడులు పెడుతూ భారీ రాబడులను ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలో అభివృద్ధి చెందుతున్న పరిసరాల్లో రియల్ ఎస్టేట్ జూదం ఆడటంలో వీరంతా సుప్రసిద్ధులు. అమితాబ్- అభిషేక్ బచ్చన్ ద్వయం ముంబై పరిసరాల్లో పలు రియల్ వెంచర్ల ద్వారా యేటేటా కోట్లలో ఆర్జిస్తున్నారు. అపార్ట్ మెంట్లు కొనడం అమ్మడం ద్వారా భారీ లాభాలు కళ్ల జూస్తున్నారు. ఇంతకుముందు నగరంలోని ఓ ఇంటిని అమ్మడం ద్వారా ఏకంగా 49 కోట్ల లాభం కళ్ల జూసారు అమితాబ్. అలాగే చాలా మంది నటీమణులు తమ ఫ్లాట్ లను రీసేల్ చేయడం లేదా అద్దెల రూపంలో భారీగా డబ్బును వెనకేస్తున్నారు.
ఇప్పుడు ఆలియా భట్ కుటుంబ సభ్యులకు చెందిన ఓ ఫ్లాట్ ని ఏకంగా 9 లక్షల రెంట్ కి ఇచ్చారు. ఇది పాలీహిల్ ఏరియాలో నర్గీస్ దత్ రోడ్‌లోని వాస్తు భవనం ఆరవ అంతస్తులో ఉంది. ఒక స్థిరాస్తి వ్యాపార వెబ్ సైట్ వివరాల ప్రకారం.. ఈ ఆస్తిని రూ.9 లక్షల నెలవారీ అద్దెకు, రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో నరేంద్ర శెట్టి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు.
అలియా భట్ కుటుంబ సభ్యులు సోనీ మహేష్ భట్ - షాహీన్ భట్ లకు చెందిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రై.లిమిటెడ్ కి చెందిన ఈ ఆస్తి ఇప్పుడు భారీ అద్దెను అందిస్తోంది. సినిమాలు, డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ఓటీటీ కోసం పలు చిత్రాలను రూపొందిస్తోంది.