Begin typing your search above and press return to search.

అమ్మాయిల ఫస్ట్‌ స్పై థ్రిల్లర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఇప్పటి వరకు బాలీవుడ్‌ నుంచి ఎన్నో స్పై థ్రిల్లర్‌ సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   5 Oct 2024 7:28 AM GMT
అమ్మాయిల ఫస్ట్‌ స్పై థ్రిల్లర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌
X

ఇప్పటి వరకు బాలీవుడ్‌ నుంచి ఎన్నో స్పై థ్రిల్లర్‌ సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలు ఎక్కువగా స్పై థ్రిల్లర్ సినిమాలను చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ తరహా సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్ ఫిల్మ్స్ వారి నుంచి వచ్చిన విషయం తెల్సిందే. మరోసారి స్పై థ్రిల్లర్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్ వారు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమాలకు ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మొదటి లేడీ స్పై థ్రిల్లర్ సినిమాగా 'ఆల్ఫా' మూవీ రాబోతుంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌, శార్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఆల్ఫా' సినిమాకు శివ్‌ రావేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్ఫా సినిమాను నిర్మిస్తున్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. మొదటి లేడీ స్పై చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం హిందీలోనే కాకుండా తమిళ్‌, తెలుగు లోనూ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆలియా భట్ ప్రస్తుతం జిగ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. జిగ్రా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే ఆల్ఫా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ లో ఆలియా భట్‌ పాల్గొనబోతుంది. ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ లు కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారీ ఎత్తున స్పై థ్రిల్లర్‌ సినిమా లు వస్తున్న ఈ సమయంలో ఆల్ఫా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

యశ్‌ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌ లో రాబోతున్న ఆల్ఫా సినిమా మరో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఈ సినిమాలో ఆలియా భట్‌ గురువు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పోషించేది గెస్ట్‌ రోల్‌ అయినా సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఆలియా భట్‌ తల్లి అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆల్ఫా సినిమా భారీ యాక్షన్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రాబోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చాలా స్పెషల్‌ గా ఈ సినిమా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు.