Begin typing your search above and press return to search.

'జిగ్రా' రివ్యూ: ఆలియా భట్ ఆకట్టుకుందా?

దసరా స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏమేరకు మెప్పించిందో చూద్దాం.

By:  Tupaki Desk   |   12 Oct 2024 4:41 PM GMT
జిగ్రా రివ్యూ: ఆలియా భట్ ఆకట్టుకుందా?
X

RRR సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ ఆలియా భట్. ఒకవైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సబ్జక్ట్స్ తో అలరిస్తోంది. ఇందులో భాగంగా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ''జిగ్రా''. దీంట్లో వేదాంగ్‌ రైనా, మనోజ్‌ పవా, రాహుల్‌ రవీంద్రన్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి తెలుగులోకి అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. రామ్ చరణ్ ట్రైలర్ లాంచ్ చేయడం.. హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం.. దానికి సమంత, త్రివిక్రమ్ గెస్టులుగా రావడం.. మహేష్ బాబు లాంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంతో ఈ సినిమా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పడింది. దసరా స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏమేరకు మెప్పించిందో చూద్దాం.

'జిగ్రా' కథేంటంటే.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సత్యభామ ఆనంద్‌ (అలియా భట్), అంకుర్ ఆనంద్‌ (వేదాం రైనా).. తమ బంధువుల దగ్గర పెరుగుతారు. తల్లితండ్రీ అన్నీ తానై తన తమ్ముడు అంకుర్ కు చూసుకుంటుంది సత్య. బిజినెస్‌ పని మీద సోదరుడి వరసయ్యే కబీర్ తో కలిసి కొరియాలోని హన్షదావో దీవికి వెళ్తాడు అంకుర్‌. అయితే కబీర్ కారణంగా చేయని తప్పుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసులో అంకూర్ కి కోర్టు మరణ శిక్ష విధిస్తుంది. దీంతో సత్య తన తమ్ముడిని కాపాడుకోడానికి హన్షి దావోకు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? అంకూర్ ని జైలు నుంచి విడిపించడానికి ఎలా ఫైట్ చేసింది? నిర్దోషి అయిన తమ్ముడిని బయటికి తీసుకురాగలిందా లేదా? అనేదే మిగతా కథ.

ఆపదలో చిక్కుకున్న తమ వారిని కాపాడేందుకు హీరో లేదా హీరోయిన్లు ప్రాణాలకు తెగించి మరీ పోరాడటం అనే కాన్సెప్ట్ మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'జిగ్రా' కూడా అదే రొటీన్ కాన్సెప్ట్ తో వచ్చింది. అన్యాయంగా కేసులో ఇరుక్కుని జైలు పాలైన తన తమ్ముడిని విడిపించడానికి అక్క చేసే పోరాటాన్ని చూపించారు. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ, తమ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను ఉత్కంఠకు గురి చేసే సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ దర్శకుడు తన స్క్రీన్‌ ప్లేతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. అక్కడక్కడా మాత్రమే మెప్పించగలిగాడు.

జైలు నుంచి తప్పించుకోవడం అనే లైన్ మీద తీసిన సినిమాలు, ప్రేక్షకుడిని థ్రిల్ చేసేలా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉండాలి. తర్వాత ఏం జరగబోతోందా అనే ఆసక్తిని గురి చెయ్యాలి. కానీ ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. తమ్ముడిని కాపాడేందుకు సత్య వేసే ప్రయత్నాలు, జైలు నుంచి పారిపోవడానికి అంకూర్ చేసే ప్రయత్నాలు అన్నీ రొటీన్‌ గానే ఉంటాయి. అంతేకాదు సత్య వేసే ప్లాన్స్ చూస్తే జైల్లో ఖైదీలను విడిపించడం అంతా ఈజీగా అనే అనుమానం కలుగుతుంది. అలానే జైలు గోడలు బద్దలు కొట్టేదాం అంటూ సత్య చెప్పే డైలాగ్స్ సిల్లీగా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. దాదాపు ఇరవై నిమిషాలు పాటు సాగే ఈ సీక్వెన్స్ యాక్షన్ ప్రియులని అలరిస్తుంది.

సత్యగా అలియా భట్‌ ఆకట్టుకుంటుంది. సినిమా కోసం ఆమె పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. నటనపరంగానూ ప్రభావం చూపించింది. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది. తమ్ముడి పాత్రలో నటించిన వేదాంగ్‌ రైనా, ముత్తు పాత్రలో నటించిన రాహుల్‌ రవీంద్రన్‌ తమ పరిధి మేరకు నటించారు. రొటీన్ కథ అవ్వడం ఈ సినిమాకి ప్రధాన లోపం. అక్కా తమ్ముళ్ల మధ్య బలమైన అనుబంధాన్ని సరిగా బిల్డ్‌ చెయ్యలేదు. సినిమా లెన్త్ కూడా ఎక్కువైంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. టెక్నికల్ గా మాత్రం సినిమా బాగుంది. కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు పడతాయి. ఓవరాల్ గా అలియా భట్ ను అభిమానించేవారికి ఈ సినిమా నచ్చవచ్చు. అయితే ఇది బాక్సాఫీస్ గోడలను ఏమాత్రం బద్దలు కొడుతుందో చూడాలి.