మర్డర్ కేసులో హీరోయిన్ చెల్లి అరెస్ట్!
న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ కొంత కాలం పాటు ఎడ్వర్ట్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది.
By: Tupaki Desk | 3 Dec 2024 6:06 AM GMTబాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో అలియా ప్రధాన నిందితురాలిగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ బాయ్‌ప్రెండ్, అతని స్నేహితురాలిని సజీవదహనం చేసినట్లు అలియాపై అభియోగాలున్నాయి. ప్రియుడుకు చెందిన గ్యారేజీకి నిప్పు అంటించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.
న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ కొంత కాలం పాటు ఎడ్వర్ట్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ జాకోబ్‌కు అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని అలియా ఫక్రీ పలు మార్లు తన మాజీ బాయ్‌ప్రెండ్‌పై బెదిరింపులకు పాల్పడినట్లు న్యూయార్క్ డైలీ కథనం పేర్కొంది.
అనాస్టీసియాతో ఎడ్వర్ సాన్నిహిత్యం చూసి తట్టుకోలేక అసూయకు గురై అలయా ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆరోపించింది. క్వీన్స్ క్రిమినల్ కోర్టులో విచారణ అనంతరం అలయాకు బెయిల్ కూడా నిరాకరించబడింది. ఈ ఘటనకు సంబంధించి నర్గీస్ ఫక్రీ తల్లి న్యూయార్క్ డైలీతో మాట్లాడారు.` నా కుమార్తె ఎలాంటి తప్పు చేయలేదు. ఒకరిని చంపే స్వభావం తనది కాదు. ఆమెకు ఇతరులకు సహాయం మాత్రమే తెలుసు.
ఆమె కొన్ని రోజుల క్రితం దంతాలకు సంబంధించిన చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో అలయా మత్తు మందులు ఎక్కువగా తీసుకుంది. అప్పటి నుంచి ఆమెలో కొన్ని రకాల మార్పులొచ్చాయి` అని తెలిపారు. ఈ ఘటనపై బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె నటిగా బిజీగా ఉంది. తెలుగులో `హరి హర వీరమల్లు` చిత్రంలోనూ నటిస్తోంది.