పుష్పరాజ్ ను అల్లరోడు అడ్డుకుంటాడా?
ఇలా ఈ వారంలో 'బచ్చల మల్లి' తో పాటుగా మూడు అనువాద చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్ట్రెయిట్ మూవీ కాబట్టి అల్లరి నరేష్ సినిమాకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 Dec 2024 11:49 AM GMTక్రిస్మస్ పండుగను సినిమాలకు మంచి సీజన్ గానే భావిస్తుంటారు. ఏడాది చివర్లో వచ్చే హాలీడేస్ ను క్యాష్ చేసుకుని, న్యూ ఇయర్ లో సంక్రాంతి ఫెస్టివల్ వరకూ థియేటర్లలో సందడి చేయొచ్చని ఫిలిం మేకర్స్ ఆలోచిస్తారు. అందుకే ప్రతీ సంవత్సరం క్రిస్మస్ కు అనేక చిత్రాలను విడుదల చేస్తుంటారు. ఈసారి కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. వాటిల్లో నాలుగైదు చిత్రాలు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాకపోతే ఇవి 'పుష్ప 2'ను తట్టుకొని ఏ మేరకు వసూళ్లు రాబడతాయనేది ఆసక్తికరంగా మారింది.
అల్లరి నరేష్ హీరోగా నటించిన 'బచ్చల మల్లి' సినిమా డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని నిర్మాత రాజేష్ దండు నిర్మించారు. ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ కు 'రంగస్థలం' ఎలాగో, అల్లరోడికి ఈ సినిమా అలాగా అని చిత్ర బృందం చెబుతోంది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.
'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో ఈ ఏడాది ప్లాప్ అందుకున్న అల్లరి నరేష్.. 'బచ్చల మల్లి' మూవీతో హిట్టు కొడతానని ధీమాగా ఉన్నారు. 'ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. ఈ క్రిస్మస్ మాత్రం మనదే' అంటూ గతంలో ఎప్పుడూ లేని విధంగా స్టేజ్ మీదనే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదొక్కటే. 'రాబిన్ హుడ్', 'సారంగపాణి జాతకం' సినిమా బరిలో నుంచి తప్పుకోవడంతో అల్లరోడి మూవీకి మంచి ఛాన్స్ దక్కింది. కాకపోతే దీనికి మూడు డబ్బింగ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'ముఫాసా: లయన్ కింగ్' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో, తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. మహేశ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ కంటే తెలుగు వెర్షన్ ప్రీ సేల్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక దీంతో పాటుగా విజయ్ సేతుపతి, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో రూపొందిన 'విడుదల పార్ట్ 2' సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో రాబోతున్నట్లు ట్రైలర్ తో అర్థమైంది.
కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యూఐ' సినిమా కూడా ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల కోసం ఎదురు చేసే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులోనూ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఆల్రెడీ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ క్రేజీగా అనిపించింది. ఉపేంద్ర చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్ ఈ సినిమాకి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసాయి.
ఇలా ఈ వారంలో 'బచ్చల మల్లి' తో పాటుగా మూడు అనువాద చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్ట్రెయిట్ మూవీ కాబట్టి అల్లరి నరేష్ సినిమాకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజుల్లో పాజిటివ్ టాక్ చాలా కీలకం కాబట్టి, మార్నింగ్ షోకి బాగుందనే మాట బయటకు వస్తే బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో దేనికి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదు. టాక్ ని బట్టి వీకెండ్ లో కలెక్షన్లు ఉంటాయి.
కాకపోతే బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2: ది రూల్' ర్యాంపేజ్ ఇంకా కొనసాగుతూనే ఉండటం ఈ వారం వచ్చే సినిమాలను కలవరపెట్టే విషయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాకి టికెట్ రేట్లు కూడా తగ్గాయి. ఇన్నాళ్లూ అధిక ధరల కారణంగా థియేటర్లకు వెళ్లని ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్ లో పుష్పరాజ్ ని చూడాలని అనుకునే అవకాశం ఉంది. ఈ అడ్డంకులన్నీ దాటుకొని 'బచ్చల మల్లి' మూవీతో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అల్లరి నరేష్ హిట్టయితే తెలుగులో 'పుష్ప 2' హవా కాస్త తగ్గుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం.. ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో!