గీసి గీసి చేస్తానంటే నరేష్ కి నచ్చదు!
అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తవుతుంది అన్నది అన్ని ప్రాజెక్ట్ ల విషయంలో జరగదు.
By: Tupaki Desk | 21 Dec 2024 6:30 PM GMTఏ సినిమాకైనా ప్రారంభానికి ముందే బడ్జెట్ కేటాయింపు జరిగిపోతుంది. కానీ సెట్స్ కి వెళ్లిన తర్వాత ఆ బడ్జెట్ పెరగొచ్చు. తగ్గొచ్చు. అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తవుతుంది అన్నది అన్ని ప్రాజెక్ట్ ల విషయంలో జరగదు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోతే? ఒక్కోసారి ఖర్చులు పెరుగుతుంటాయి. అలాంటప్పుడు అదనంగా మరికొంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అదంతా కథ మీద...దర్శకుడి పని తీరుపైనా అధారపడి ఉంటుంది.
చాలా వరకూ ఏ సినిమాకైనా బడ్జెట్ పెరగడానికే అవకాశం ఉంటుంది. తగ్గే అవకాశాలు అన్నది రేర్ కేసెస్ లోనే చోటు చేసుకుటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ తనకెదురైన అనుభవాల్ని చెప్పుకొచ్చారు. `సినిమాకి తగ్గ బడ్జెట్ ఇవ్వడం అన్నది నిర్మాత పని. కానీ ఆ బడ్జెట్ కు బాధ్యత వహించాల్సింది మాత్రం దర్శకుడు, హీరో, ఇతర టీమ్ సభ్యులు మాత్రమే. దేనికెంత ఖర్చు అవుతుందన్నది దర్శకుడికి క్లారిటీ ఉండాలి. హీరో కూడా ఖర్చును అదుపు చేయగలగాలి.
అవసరమైన చోట పెట్టాలి. అవనసరం అనుకున్న చోట కట్ చేయాలి. ఈ ప్రణాళికతో వెళ్లకపోతే సినిమా బడ్జెట్ బోర్డర్ దాటి పోతుంది. అలాగని గీసి గీసీ చేయకూడదు. అలా చేసే వాళ్లు అంటే నచ్చదు. కథకి ఎంత అవసరమో అంత సంపూర్ణంగా పెట్టాలి. అలా ఇవ్వకపోతే దర్శకుడు క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వలేడు. బడ్జెట్ మిగులు ఎప్పుడంటే 10 రోజుల్లో పూర్తి చేయాల్సిన షూటింగ్ ఏడెనిమిది రోజుల్లో పూర్తి చేయగలిగితే అక్కడ చాలా వరకూ మనీ సేవ్ అవుతుంది.
ఆ బడ్జెట్ నిర్మాత ప్రచారానికో...మరో పనికో వాడుకోవడానికి పనికొస్తుంది. సెట్స్ కి వెళ్లిన తర్వాత అనవసరంగా డబ్బు వృద్ధా కాకూడదు. ఎందుకంటే దర్శక, హీరోలు ప్రతీ పైసాకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా వరకూ భారీ బడ్జెట్ సినిమాలంటూ ఉండవు. సింపుల్ స్టోరీ. దానికి తగ్గట్టు చిన్న బడ్జెట్ లు ఉంటాయి. నష్టాలొచ్చినా? భారీ మొత్తంలో రావు. సినిమా బాగుండాలి అంటే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది` అన్నారు.