కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్‌పై వేధింపుల ఆరోపణలు
లైంగిక వేధింపుల అంశంలో నిష్క్రియాత్మకతపై ప్రతిపక్షాల నుంచి హీట్‌ని ఎదుర్కొంటున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి తాజా వివాదంతో మరో చిక్కు వచ్చి పడింది.
By: Tupaki Desk | 25 Aug 2024 2:45 AM GMTప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు, కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ రంజిత్‌పై బెంగాళీ నటి శ్రీలేఖ మిత్రా సంచలన ఆరోపణలు చేసారు. రంజిత్ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. లైంగిక వేధింపుల అంశంలో నిష్క్రియాత్మకతపై ప్రతిపక్షాల నుంచి హీట్‌ని ఎదుర్కొంటున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి తాజా వివాదంతో మరో చిక్కు వచ్చి పడింది.
జస్టిస్ హేమ కమిటీ సినీపరిశ్రమలో వేధింపుల గురించి నివేదికను ప్రచురించిన క్రమంలో ఈ వివాదం సర్వత్రా చర్చనీయాంశమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఉదంతాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. దోషులపై చర్య తీసుకోవాలని హేమ కమిటీ పిలుపునిచ్చింది.
ఇలాంటి సమయంలో మలయాళ సినీపరిశ్రమకు చెందిన వేధింపుల ప్రహసనం అందరి దృష్టికి వచ్చింది. అయితే దర్శకనిర్మాత రంజిత్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. ఈ కేసులో తాను అసలు బాధితుడుని అని ఆయన వాదిస్తున్నారు. బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆరోపణపై విచారణ కోరుతున్న వారిలో కీలకమైన ఎల్‌డిఎఫ్ భాగమైన సిపిఐ కూడా ఉంది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక సృష్టించిన అలజడుల నేపథ్యంలో ఆకస్మికంగా నటి శ్రీలేఖ కొన్నేళ్ల కిందట జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారని చెబుతున్నారు.
``రంజిత్ మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద వ్యక్తి. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు. అతడితో సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి నేను అతడి నివాసానికి వెళ్లాను. కానీ ఆ సమయంలో అతడి ప్రవర్తన నాకు నచ్చలేదు. అతడు అనుచితంగా ప్రవర్తించాడు. నేను అసౌకర్యంగా భావించాను..`` అని శ్రీలేఖ మిత్రా మీడియాకు చెప్పారు.అతడు నా అనుమతి లేకుండా అలా చేసాడు.
దానికి నా అసమ్మతిని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఇకపై ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదని నా నిర్ణయాన్ని వెంటనే చెప్పేశాను. ఆ చోటును వదిలి మరుసటి రోజు కోల్‌కతాకు తిరిగి వచ్చాను! అని బెంగాలీ నటి శ్రీలేఖ తెలిపారు. సినీ పరిశ్రమలోని ఇతర మహిళా నటీనటుల విషయంలో అతడు ఇలాగే ప్రవర్తించాడో లేదో నాకు తెలియదు. అలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైనట్లయితే దానిని ఓపెనవ్వాలా లేదా అనేది సంబంధిత నటీమణుల ఇష్టం.
అతడి పవర్ ప్రభావం చూపిస్తుంది. బయటకు మాట్లాడనీకుండా చేస్తుంది! అని కూడా శ్రీలేఖ వ్యాఖ్యానించారు. బెంగాలీ సినీ పరిశ్రమలో తనకు అలాంటి అనుభవం లేదని, అయితే ఏదో ఒక చోట ఎవరో ఒకరి విషయంలో ఇతర మహిళా నటులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని మిత్రా అన్నారు. అలాంటి మహిళలు ధైర్యం తెచ్చుకుని ఎలాంటి భయం లేకుండా మాట్లాడాలని పిలుపునిచ్చారు. కేరళలో చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఘటన ఇది.. కానీ మహిళలు ఇప్పుడు ఎలాంటి దుష్ప్రవర్తనకు అయినా వ్యతిరేకంగా ఎక్కువ శక్తితో దృఢవిశ్వాసంతో మాట్లాడటం, ర్యాలీలు చేయడం ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంది. ఏదైనా సందర్భం వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మహిళలపై దుష్ప్రవర్తన తగ్గుతుంది. వారిపై అలాంటి బాధాకరమైన కథలు ఇక ఉండవు! అని మిత్రా వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణల అనంతరం కేరళలో ఫిల్మ్ అకాడమీ ఛైర్మన్ పదవి నుంచి రంజిత్ తప్పుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ బిజు సహా పలువురు రంజిత్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసారు. కేరళ ఫిల్మ్ అకాడమీ చైర్మన్ పదవి నుంచి రంజిత్ వైదొలగుతారని ప్రతిపక్ష కాంగ్రెస్ చెబుతుండగా, కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదని బీజేపీ పేర్కొంది.
మిత్రా ఆరోపణల ఆధారంగా విచారణ జరిపించాలని, విచారణ సమయంలో రంజిత్‌ను ఆ పదవికి దూరంగా ఉంచాలని సీపీఐ జాతీయ నాయకుడు అన్నీ రాజా ప్రభుత్వాన్ని కోరారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం రక్షించదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్ హామీ ఇచ్చారు. రంజిత్‌పై ఆరోపణలు రుజువైతే తప్పకుండా అతడిపై చర్యలు తీసుకుంటామని ఆయన శనివారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంజిత్ దేశంలోని ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరని..నటి శ్రీలేఖ ఆరోపణపై తాను ఇప్పటికే స్పందించానని చెప్పారు. శ్రీలేఖ ఆరోపణలు, రంజిత్ ఇచ్చిన సమాధానం మా ముందున్నాయని, ఆమె ఫిర్యాదు చేస్తే ఇక్కడి(కేరళ)కి వచ్చి ఫిర్యాదు చేయనివ్వండి.. అప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేవలం ఆరోపణల ఆధారంగా ఎటువంటి కేసు నమోదు చేయలేరు. అలాంటి కేసులు నిలబడవు అని చెరియన్ వ్యాఖ్యానించారు. పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్న మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు నటి శ్రీలేఖకు అన్నిరకాల సౌకర్యాలు, సహాయ సహకారాలు అందిస్తామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. తప్పు చేసినవారిని ప్రభుత్వం రక్షించదని సిఎం ఇప్పటికే స్పష్టం చేశారు అని మంత్రి వర్యులు అన్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పి.సతీదేవి మాట్లాడుతూ- దర్శకుడు రంజిత్ పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానని, అది నిజమని నిరూపిస్తే, రంజిత్ అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో అనేక మంచి చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు రంజిత్ అని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ అన్నారు. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా నేను ఫిల్మ్ అకాడమీ ఛైర్మన్ పదవి నుండి వైదొలగాలని ఆయనను అభ్యర్థిస్తున్నాను అని కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీషణ్ వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఘటనలపై చాలా వరకూ నటీమణుల ఫిర్యాదులు విచారణలో నిరూపితం కాలేదు. ఇప్పుడు రంజిత్ విషయంలో నటి శ్రీలేఖ కేసును నమోదు చేసి ముందుకు వెళతారా లేదా? అన్నది ఇప్పటివరకూ స్పష్ఠత లేదు.