Begin typing your search above and press return to search.

అల్లు, అక్కినేని, మంచు.. వివాదాల్లో సినీ కుటుంబాలు!

అక్కినేని, అల్లు, మంచు లాంటి పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలు కూడా వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులను కలవరపెట్టింది.

By:  Tupaki Desk   |   13 Dec 2024 6:42 PM GMT
అల్లు, అక్కినేని, మంచు.. వివాదాల్లో సినీ కుటుంబాలు!
X

సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినీ తారలు.. దురదృష్టవశాత్తూ గత కొంతకాలంగా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాలు సైతం ఈ ఏడాది పోలీసు కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అక్కినేని, అల్లు, మంచు లాంటి పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలు కూడా వివాదాల్లో చిక్కుకోవడం అభిమానులను కలవరపెట్టింది. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకుండా అల్లు అర్జున్.. ఇతరుల చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోలు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం ఇండియన్ సినిమాలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇది అభిమానులనే కాదు, యావత్ సినీ పరిశ్రమ షాక్ అయ్యేలా చేసింది. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో, బీఎన్‌ఎస్‌ 105 & 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి బన్నీని గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం, నాంపల్లి కోర్టులో హాజరు పరచడం, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడం, చంచల్ గూడ జైలుకి తరలించడం, ఇంతలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించడం, అల్లు అర్జున్ కి మధ్యతర బెయిల్ మంజూరు చేయడం వంటివి హాట్ టాపిక్ గా నడిచాయి.

నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ను బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారనే వార్త సెన్సేషనల్ గా మారింది. అందులోనూ శుక్రవారం అరెస్ట్ చేయడంతో దీని వెనుక రాజకీయ కోణం ఉందనే కామెంట్స్ వచ్చాయి. పుష్కరాల్లో, పొలిటికల్ మీటింగ్స్ లో జరిగిన తొక్కిసలాటలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కి బాసటగా నిలిచింది. అలాంటి హృదయ విదారక ఘటన జరగడం బాధాకరం అంటూనే, దీనికి ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుణ్ణి చేయడం అన్యాయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టాలీవుడ్ తో పాటుగా మిగతా ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా బన్నీకి సపోర్టుగా నిలిచారు. భద్రతాపరమైన విషయాలను నటీనటులు చూసుకోగలరా?, ఇది పోలీసుల వైఫల్యమా? లేక థియేటర్ యాజమాన్య వైఫల్యమా? అసలు ఈ ఇష్యూలో తప్పు ఎవరిది? అనే చర్చ పక్కనపెడితే.. సినీ చరిత్రలోనే తొలిసారిగా తొక్కిసలాట ఘటనలో జరిగిన ప్రమాదానికి, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన ఒక యాక్టర్ ని బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం అనేది సంచనలంగా మారింది.

అలానే మంచు ఫ్యామిలీ గొడవలు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు కుటుంబం అంతర్గత తగాదాలో రోడ్డుకెక్కడం హాట్ టాపిక్ అయింది. మోహ‌న్‌ బాబు, ఆయ‌న పెద్ద కుమారుడు విష్ణు ఓవైపు.. చిన్న కొడుకు మనోజ్ మరోవైపు అనేలా ఈ వ్య‌వ‌హారం నడిచింది. పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, పోటాపోటీగా బౌన్సర్లను ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకోవడం, మనోజ్ గేటు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించడం, చిన్న కుమారుడికి హితబోధ చేస్తూ మోహన్ బాబు ఆడియో సందేశాలు విడుదల చేయడం, మంచు బ్రదర్స్ ఇద్దరూ మీడియా ముందు ఎవరి వాదన వాళ్ళు వినిపించడం, సినీ కమిషనర్ పిలిచి ఇద్దరితో మాట్లాడటం వంటివి జరిగాయి. అయితే ఈ క్రమంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం మోహన్ బాబును ఇబ్బందుల్లోకి నెట్టింది.

మెహన్ బాబు ఓ టీవీ ఛానల్ రిపోర్టరు చేతిలోని మైకు లాక్కుని అతనినే కొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. జ‌ర్న‌లిస్టుల‌పై దాడి ఘ‌ట‌న‌లో మొద‌ట ఆయ‌న‌పై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడిని జ‌ర్న‌లిస్టు సంఘాలు ఆందోళ‌న‌కు దిగిన తర్వాత, పోలీసులు లోతుగా విచార‌ణ జ‌రిపిన ఆయనపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసారు. ఆరోజు ఘర్షణతో అస్వస్థతకు గురైన మోహన్ బాబు.. తనకు కూడా గాయాలు అయ్యాయంటూ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. ఈలోగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. మోహన్ బాబు ఈ వివాదంలో ఇప్పటికే గాయపడిన జర్నలిస్టును క్షమాపణ కోరడం జరిగింది. తాను ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని ఓ ప్రకటన ఇచ్చారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేయడంతో, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో అక్కినేని ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మాదాపూర్‏లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌ సెంటర్ నిర్మాణం అక్రమం అంటూ హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. దీనిపై నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని, చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వెల్లడించారు. ఎన్ కన్వెషన్ సెంటర్ గురించి వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని, ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. అయితే రాజకీయ కారణాలతోనే తెలంగాణా ప్రభుత్వం ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆ సమయంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కారణంగా అక్కినేని ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కారణమంటూ మినిస్టర్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండటానికి సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు నాగార్జున, నాగచైతన్య ఆమెను బలవంతపెట్టారని.. దీనికి సమంత నిరాకరించడం వారి విడాకులకు దారితీసిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా అక్కినేని కుటుంబానికి, సామ్ కు సపోర్ట్ గా నిలిచింది. మంత్రి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను అందరూ ఖండించారు. దీంతో సురేఖ కాస్త దిగొచ్చి సమంతకు క్షమాపణలు చెప్పింది కానీ, అక్కినేని ఫ్యామిలీ పేరుని మాత్రం ప్రస్తావించలేదు. అయితే మంత్రి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నాగార్జున.. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సురేఖ‌ ఈనెల 12న వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావల్సి ఉంది. కానీ ప‌లు ఇతర కార్య‌క్ర‌మాల కార‌ణంగా వ్య‌క్తిగ‌త విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని ఆమె త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు వెల్ల‌డించడంతో, తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు.