మగధీర.. నష్టాలకు సిద్ధమైన అల్లు అరవింద్!
తెలుగు ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ‘మగధీర’. 2009లో వచ్చిన ఈ చిత్రం.. అప్పటి దాకా ఉన్న కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది.
By: Tupaki Desk | 6 Feb 2025 10:42 AM GMTతెలుగు ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి ‘మగధీర’. 2009లో వచ్చిన ఈ చిత్రం.. అప్పటి దాకా ఉన్న కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వంద కోట్ల వసూళ్ల మార్కును అందుకున్న తొలి తెలుగు చిత్రం అదే. ఐతే ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని తాను అనుకోలేదని.. దీని మీద భారీ బడ్జెట్ పెట్టిన నేపథ్యం లో రిలీజ్ ముంగిట నష్టాలకు కూడా సిద్ధమైపోయానని నిర్మాత అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
‘చిరుత’తో డెబ్యూ చేశాక చరణ్ నటించిన సినిమా ‘మగధీర’నే అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వెనుక తెర వెనుక సంగతులను అరవింద్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘మగధీర సినిమాను నా మేనల్లుడి మీద ప్రేమతో చేశాను. అతడికి పెద్ద హిట్ ఇవ్వాలనే ఒకే లక్ష్యంతో రాజమౌళిని సంప్రదించాను. చరణ్ తొలి సినిమా చాలా యావరేజ్‌గా ఆడింది. దీంతో అతడికి పెద్ద హిట్ ఇవ్వాలనుకున్నాను. రాజమౌళిని కలిసి.. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని, లాభ నష్టాల గురించి పట్టించుకోవద్దని.. భారీ చిత్రం చేద్దామని.. ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని చెప్పాను.
అలా ‘మగధీర’ కథ సిద్ధమైంది. మేం ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యే టైంకి నేను నష్టాలకు కూడా సిద్ధపడిపోయాను. ఎందుకంటే సినిమాకు అంత ఖర్చయింది. కానీ ‘మగధీర’ నా అంచనాలను మించిపోయింది. హద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయింది’’ అని అరవింద్ తెలిపారు.
ఇటీవల మెగా, అల్లు కుటుంబాల మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్లుగా భావిస్తున్న తరుణంలో అరవింద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో తెగకొట్టేసుకుంటున్న.. చరణ్, అల్లు అర్జున్ అభిమానులు ఈ వ్యాఖ్యల విషయంలోనూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు. చరణ్ కోసం అరవింద్ ఎంత చేశాడో చూశారా అని బన్నీ ఫ్యాన్స్ అంటుంటే.. గీతా ఆర్ట్స్‌లో చిరు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన నేపథ్యంలో అందుకు బదులుగా తాను చరణ్‌కు పెద్ద హిట్ ఇచ్చి రుణం తీర్చుకోవాలని ‘మగధీర’ చేసినట్లు గతంలో అరవింద్ వ్యాఖ్యానించిన వీడియోను అవతలి వాళ్లు పోస్ట్ చేసి కౌంటర్ చేస్తున్నారు.