ఆజ్యం పోసిన అల్లు అరవింద్ కామెంట్!
ఒకప్పుడు మెగా హీరోలంటే అంతా ఒక్కటే. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. మెగా ఛత్ర ఛాయ నుంచి అల్లు అర్జున్ బయటికి వచ్చేశాడు.
By: Tupaki Desk | 3 Feb 2025 9:52 AM GMTఒకప్పుడు మెగా హీరోలంటే అంతా ఒక్కటే. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. మెగా ఛత్ర ఛాయ నుంచి అల్లు అర్జున్ బయటికి వచ్చేశాడు. సొంత ఇమేజ్ కోసం అతడి తాపత్రయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. తన అభిమానులను ప్రత్యేకంగా ఆర్మీ అని పిలుచుకుంటున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తావన తగ్గించేశాడు. రామ్ చరణ్ గురించి అయితే అసలే మాట్లాడట్లేదు.
ఇవన్నీ ఒకెత్తయితే.. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి ప్రచారం చేయడం మరో ఎత్తు. ఆ పరిణామంతో మెగా అభిమానులకు, బన్నీకి మధ్య పెద్ద అగాథమే వచ్చేసింది. బన్నీ మీద చిరు, పవన్, చరణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ టైంలో కూడా వాళ్లు తమ వ్యతిరేకతను దాచుకోలేదు. దానికి బదులుగా ‘గేమ్ చేంజర్’ రిలీజ్ టైంలో బన్నీ ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కారు. ఈ సినిమా మీద నెగెటివిటీని బాగా స్ప్రెడ్ చేశారు.
‘గేమ్ చేంజర్’ ఫెయిల్యూర్ నేపథ్యంలో అసలే మెగా ఫ్యాన్స్ ఆవేదనతో ఉన్నారు. నిర్మాత దిల్ రాజు వ్యవహార శైలి కూడా వారికి నచ్చట్లేదు. ఈ సినిమా కలెక్షన్ల పోస్టర్ గురించి.. కాంబినేషన్ క్రేజ్‌తో ఈ సినిమా చేయడం గురించి పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది చాలదన్నట్లు నిన్న ‘తండేల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజును పక్కన పెట్టుకుని అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.
సంక్రాంతికి ఒక సినిమాను కిందన పెడితే .. ఇంకో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారంటూ ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ కావడం, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కావడం గురించి అరవింద్ చేసిన వ్యాఖ్యలు చరణ్ ఫ్యాన్స్‌కు రుచించలేదు. అరవింద్ క్యాజువల్‌గా, వాస్తవమే మాట్లాడినా సరే.. ఈ వ్యాఖ్యలు వారికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఆ సమయంలో అరవింద్ నవ్వడంతో ‘గేమ్ చేంజర్’ ఫెయిల్యూర్‌పై సంబరపడుతున్నట్లు, ఎగతాళి చేస్తున్నట్లు అర్థాలు తీస్తున్నారు. దీనికి బన్నీకి లింక్ పెట్టి మొత్తంగా అల్లు కుటుంబం మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు మెగా ఫ్యాన్స్.