Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ నిర్ణయంతో అంతా ఓకే అయినట్లేనా?

'తండేల్' సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అల్లు అరవింద్. ఆయన తన అనుభవంతో ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 1:51 PM GMT
అల్లు అరవింద్ నిర్ణయంతో అంతా ఓకే అయినట్లేనా?
X

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 'తండేల్' సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆల్రెడీ 'గేమ్ ఛేంజర్' మూవీ బరిలో ఉండగా.. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రాన్ని అదే టైంలో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ సినిమాకు పోటీగా.. తండేల్ ను డిసెంబరు నుంచి జనవరికి తీసుకెళ్తున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే నిర్మాత అల్లు అరవింద్ వీటన్నిటికీ చెక్ పెట్టారు.

అల్లు, మెగా క్యాంపుల మధ్య ఫైట్ ఖాయమని నివేదికలు వస్తున్న నేపథ్యంలో.. సస్పెన్స్ కు తెర దించుతూ, 'తండేల్' సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అల్లు అరవింద్. ఆయన తన అనుభవంతో ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో తమ కుటుంబానికి ఉన్న బలమైన బంధాన్ని, బంధుత్వాన్ని దృష్టిలో ఉంచుకునే సంక్రాంతికి తన సినిమాను తీసుకొచ్చే ఆలోచన చెయ్యలేదనేది అర్థమవుతుంది.

ఇటీవలి కాలంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య అంతా సవ్యంగా లేదనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో జరిగిన విషయాలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే అల్లు అరవింద్ ఆ మధ్య పవన్ కల్యాణ్ కలిసి తమ మధ్య అంతా బాగానే ఉందని పరోక్షంగా ప్రకటించారు. ఇప్పుడు సినిమాల విడుదల తేదీల విషయంలోనూ ఎంతో మెచ్యూర్ గా నిర్ణయం తీసుకుని, తమ మధ్య ఏమున్నా అవన్నీ తాత్కాలికమే అని చెప్పకనే చెప్పారు.

నిజానికి సంక్రాంతి సీజన్ లో నాలుగు పెద్ద సినిమాలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికి మూడు చిత్రాలే ఫిక్స్ అయ్యాయి కాబట్టి, ఇంకో మూవీ వచ్చినా థియేటర్ల సమస్య ఏమీ ఉండదు. గతంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు పొంగల్ కు తమ సినిమాలను రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే అల్లు అరవింద్ కూడా 'తండేల్' చిత్రాన్ని పండక్కే తీసుకురావాలని పట్టుబట్టి కూర్చోవచ్చు. కానీ ఆయన అలా ఆలోచించలేదు. వివాదాలను నివారించే బాధ్యత తీసుకున్నారు.

బాక్సాఫీసు వద్ద 'గేమ్ ఛేంజర్' సినిమాకు ఇబ్బంది కలగకూడదని, ఎలాంటి పోటీ ఉండకూడదని భావించి 'తండేల్' చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కు తీసుకెళ్ళారు అల్లు అరవింద్. ఇది రెండు సినిమాలకు మేలు చేయడమే కాదు, ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వార్స్ ను నివారిస్తుంది. పాజిటివ్ ఇంప్రెషన్ కలగడానికి దోహదం చేస్తుంది. అభిమానులు ఒకరి సినిమాకు మరొకరు సపోర్టు చేసుకోడానికి ఆస్కారం ఉంది. చూడాలి.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో!