అల్లు అయాన్, అర్హ స్కూల్ స్టేజ్ షో
ఇప్పుడు మరోసారి వీరిద్దరి యొక్క ముద్దు ముద్దు స్టెప్స్, ఫ్యాన్సీ డ్రెస్‌లో వీరి లుక్ వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 1 Feb 2025 7:57 AM GMTటాలీవుడ్ సెలబ్రెటీ పిల్లలలో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి పిల్లలు అయాన్, అర్హలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు. కొన్నాళ్ల క్రితం వరకు మహేష్ బాబు కూతురు సితార తన క్యూట్ మాటలతో, ఎక్స్ ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. కానీ ఇప్పుడు సితార పెద్దగా అయ్యింది. చదువులపై ఎక్కువ దృష్టి పెడుతూ బిజీగా ఉన్నట్లుంది. అందుకే సోషల్ మీడియాలో సీతూ పాప కనిపించడం లేదు. ఆ లోటును అల్లు అర్జున్ కూతురు అర్హ భర్తీ చేస్తుంది. అర్హ సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అర్హ చెప్పిన తెలుగు పద్యం ఓ రేంజ్‌లో వైరల్ వెళ్లింది.
నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్‌లో అల్లు అర్హ, అయాన్‌లు పాల్గొన్నారు. ఆ సమయంలో వారు చేసిన సందడి, చెప్పిన ముచ్చట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను కుదిపేశాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి యొక్క ముద్దు ముద్దు స్టెప్స్, ఫ్యాన్సీ డ్రెస్‌లో వీరి లుక్ వైరల్ అవుతోంది. స్కూల్ కార్యక్రమంలో అల్లు అర్హ, అయాన్ ఇద్దరూ ఫ్యాన్సీ డ్రెస్‌లో సందడి చేశారు. అంతే కాకుండా స్టేజ్‌పై వీరిద్దరు చేసిన డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే తమ ఇద్దరు పిల్లల వీడియోలను స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో అయ్యే వారు మాత్రమే కాకుండా నెటిజన్స్ అంతా పిల్లల డాన్స్‌కి ఫిదా అవుతున్నారు.
అల్లు అర్హ ఇప్పటికే పలు సార్లు బుల్లి తెరపై, సోషల్ మీడియాలో కనిపించింది. త్వరలోనే సినిమాల్లోనూ అర్హ కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఈ స్థాయిలో అర్హ కు దక్కిన పాపులారిటీని ఉపయోగించుకుని పాపను సినిమాలో నటింపజేస్తే బాగుంటుందని ఇప్పటికే కొందరు బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమాలో అర్హతో గుణశేఖర్ చిన్న పాత్ర చేయించాడు. చిన్న పాపే అయినా ఆ పాత్రకు న్యాయం చేసే విధంగా అర్హ నటించింది. ఇతర హీరోల సినిమాల్లో కాకుండా బన్నీ సినిమాలోనే ఏదో ఒక సన్నివేశం చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే... పుష్ప 2 సినిమాతో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్ప 2 సినిమా నార్త్ ఇండియాలో మరే ఇండియన్ సినిమాకు దక్కని అరుదైన రికార్డ్‌లు ఎన్నింటినో దక్కించుకున్నాడు. నేడు తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనబోతున్న అల్లు అర్జున్ ఇదే ఏడాదిలో త్రివిక్రమ్‌తో తన నాల్గవ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. త్రివిక్రమ్ మొదటి సారి పాన్ ఇండియా రేంజ్ మూవీని చేయబోతున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 తర్వాత సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.