ధూమ్ -4లో ఆ ఇద్దరు దక్షిణాది స్టార్లకు ఛాన్స్?
ఇకపోతే ధూమ్ ఫ్రాంఛైజీ నుంచి ధూమ్ 4 తెరకెక్కనుందని యష్ రాజ్ ఫిలింస్ ఈసారి కూడా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం ఉంది.
By: Tupaki Desk | 14 Jan 2025 6:30 AM GMTధూమ్ ఫ్రాంఛైజీ చిత్రాలపై భారతీయ ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే. ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 ఇప్పటికే విడుదలై ఘనవిజయాలు సాధించాయి. ఇందులో ధూమ్ 2 పాన్ ఇండియాలో సంచలన విజయం అందుకుంది. అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 స్థాయి విజయం సాధించకపోయినా కానీ, ఫ్రాంఛైజీ చిత్రంగా అది కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లు ధూమ్ 2, ధూమ్ 3 అద్భుత వసూళ్లను సాధించాయి. అయితే ధూమ్ చిత్రంతో జాన్ అబ్రహాం ఒక ట్రెండ్ సెట్టర్ గా కనిపించాడు. అతడి నెగెటివ్ పాత్ర అందరినీ ఆకట్టుకోగా, అదే బాటలోనే హృతిక్, అమీర్ ఖాన్ కూడా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను ఫ్రాంఛైజీలో కొనసాగించారు.
ఇక తొలి రెండు భాగాలకు సంజయ్ గద్వి దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ నటించిన మూడో భాగానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఇకపోతే ధూమ్ ఫ్రాంఛైజీ నుంచి ధూమ్ 4 తెరకెక్కనుందని యష్ రాజ్ ఫిలింస్ ఈసారి కూడా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం ఉంది.
కానీ ఈ సినిమా కాస్టింగ్ విషయంలో బ్యానర్ అంత సంతృప్తిగా లేదు. ముఖ్యంగా ధూమ్ 4లో ప్రధాన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలి? అనే డైలమాలోనే చాలా కాలంగా ఉంది. ఎట్టకేలకు నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్ ని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతోంది ఈ బ్యానర్. యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్టు కొట్టిన రణబీర్ కి ధూమ్ 4లో అవకాశం ఇవ్వడం యష్ రాజ్ బ్యానర్ తీసుకున్న సరైన నిర్ణయంగా భావించాలి.
అయితే మొదటి మూడు భాగాల్లో అభిషేక్ బచ్చన్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాడు. ఆ పాత్రతో అతడికి ఒరిగిందేమీ లేదు కానీ, సహాయక పాత్రలో అతడు స్టైలిష్ గా కనిపించేందుకు ప్రయత్నించాడు. ఇకపోతే, ఇప్పుడు ఆ పాత్రను ఒక దక్షిణాది హీరోకి ఆఫర్ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా ప్రభాస్ ను యష్ రాజ్ బ్యానర్ ధూమ్ 4 కోసం సంప్రదిస్తోందని గుసగుసలు ఉన్నాయి. కానీ అది కన్ఫామ్ కాలేదు.
మరోవైపు పుష్ప ఫ్రాంఛైజీతో సంచలన విజయాలు అందుకున్న అల్లు అర్జున్ కి కూడా యష్ రాజ్ ఫిలింస్ అవకాశం ఇచ్చేందుకు ఆస్కారం ఉందని ఇప్పుడు అభిమానులు ఊహిస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోలకే ఛాలెంజ్ చేస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లకు ఇలాంటి అవకాశం కల్పించినా కానీ, వారు సహాయక పాత్రలో నటిస్తారా లేదా? అన్నది సందిగ్ధమే. ఒకవేళ ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో అవకాశం కల్పించి ఉంటే అలాంటి పెద్ద స్టార్లు ఓకే చెప్పేవారని కూడా విశ్లేషిస్తున్నారు. ధూమ్ 4లో అవకాశం అందుకునే పెద్ద దక్షిణాది హీరో ఎవరై ఉంటారు? అన్నది వేచి చూడాలి. పృథ్వీరాజ్ సుకుమారన్, కిచ్చా సుదీప్, ఫహద్ ఫాజిల్ లాంటి వారికి ఇది వర్కవుటవుతుందేమో!