Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కేసులో డబుల్ డౌట్స్.. ఏది నిజం?

అయితే, రెండో లేఖ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చినట్లు చెబుతున్నా.. అది మాత్రం చేతితో రాసిన లేఖలా ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   17 Dec 2024 3:56 AM GMT
అల్లు అర్జున్ కేసులో డబుల్ డౌట్స్.. ఏది నిజం?
X

సంధ్య థియేటర్‌లో జరిగిన అపశృతి, అల్లు అర్జున్ అరెస్ట్ చుట్టూ తలెత్తిన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పుష్ప 2 స్పెషల్ షో సందర్భంగా ఏర్పడిన గందరగోళం వల్ల తొక్కిసలాట జరుగడం, అందులో ఓ మహిళ మృతి చెందడం అందరిని షాక్ కు గురి చేసింది. ఘటనలో బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటన లో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో రెండు ప్రధానమైన డౌట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అల్లు అర్జున్ నిరపరాధి అని కొందరు వాదిస్తుండగా, మరోవైపు ఎవరూ చట్టానికి అతీతులు కారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెండు లేఖలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ రాసిన లేఖ. మరొకటి పోలీసుల నుంచి వచ్చినట్లు చెప్పబడుతున్న, ఆ అభ్యర్థనను తిరస్కరించిన లేఖ. ఈ రెండు లేఖల చుట్టూ అసలు నడుస్తున్న చర్చలో నిజమెంత అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

సంధ్య థియేటర్‌ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిన లేఖ చూసుకుంటే అది అధికారిక లెటర్‌హెడ్ మీద ఉండడం విశేషం. పుష్ప 2 చిత్రబృందం స్పెషల్ షోకు హాజరవుతున్న నేపధ్యంలో పోలీసుల సహాయాన్ని కోరుతూ రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, రెండో లేఖ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చినట్లు చెబుతున్నా.. అది మాత్రం చేతితో రాసిన లేఖలా ఉండటం గమనార్హం. అదనంగా, ఆ లేఖ అధికారిక లెటర్‌హెడ్ పై రాలేదు. పైగా, పేజీని బాగా పరిశీలిస్తే అది స్టేపుల్స్‌కు సంబంధించిన కాగితంపై రాసినట్లు కనిపిస్తోంది.

దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఈ లెటర్ నిజమా, కాదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. అందులో "హీరో, హీరోయిన్, ప్రొడక్షన్ యూనిట్ 4-12-2024న థియేటర్‌కు రాకూడదు" అని స్పష్టంగా రాసి ఉంది. కానీ అది అసలు అధికారిక లేఖ కాదని, ఏదో ఎడిట్ చేసిన లేఖ అయి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఈ లేఖను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల నుంచి వచ్చిన లేఖ నిజమేనా? అది డిపార్ట్‌మెంట్ అధికారిక లెటర్‌హెడ్ పై ఎందుకు లేదన్నది ప్రధానంగా చర్చకు దారి తీసింది. లేఖ అసలైనదా లేదా అనే అంశం కేసులో కీలకపాత్ర పోషించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌కు జనవరి 12వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ రెండు లేఖలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో కేసు మరింత కీలకంగా మారింది. మరోవైపు, ఈ కేసు పరిణామాలు చలనచిత్ర పరిశ్రమలో భద్రతా వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. ఇలాంటి సంఘటనల పునరావృతం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో స్పష్టమైంది.